
ఓఆర్ఆర్‌పై 11 ఏళ్ల బాలుడి డ్రైవింగ్.. వైరల్ వీడియోతో తండ్రి అరెస్ట్
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పై కేవలం 11 ఏళ్ల మైనర్ బాలుడు అత్యంత ఖరీదైన ఓపెన్-టాప్ ఎంజీ సైబర్‌స్టర్ లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ నడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై తక్షణమే స్పందించిన రాజేంద్రనగర్ పోలీసులు, టోలిచౌకికి చెందిన సదరు వ్యాపారవేత్త (బాలుడి తండ్రి) పై కేసు నమోదు చేశారు.
వైరల్ అయిన ఆ వీడియోలో.. ఓపెన్-టాప్ లగ్జరీ కారును మైనర్ బాలుడు వేగంగా నడుపుతుండగా, అతని పక్క సీట్లోనే కూర్చున్న తండ్రి ఒక చేతిని పైకెత్తి కనిపించడం గమనార్హం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. రాజేంద్రనగర్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పోలీసు బృందం వీడియోను ధృవీకరించి, సంబంధిత వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. అనంతరం మైనర్ బాలుడితో పాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించింది.
పోలీసులు మైనర్ చేత వాహనం నడపించడం, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయించడం, చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు, సంరక్షకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మైనర్లకు వాహనాల తాళాలు ఇవ్వడం వల్ల తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. రహదారి భద్రత ఇంటి నుంచే ప్రారంభమవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
