Let's talk: editor@tmv.in
1-1 డ్రాతో లండన్ డెర్బీ థ్రిల్లర్ ముగింపు

1-1 డ్రాతో లండన్ డెర్బీ థ్రిల్లర్ ముగింపు

Koripelli Aditya
2 డిసెంబర్, 2025

లండన్ డెర్బీలో స్టామ్‌ఫోర్డ్ బ్రిడ్జ్ మైదానంలో ఆర్సెనల్‌, చెల్సీ జట్ల మధ్య మంటలు చెలరేగాయి. ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సెనల్‌ జట్టును 10 మందితోనే ఢీ కొన్న చెల్సీ జట్టు, రసవత్తరమైన పోరులో 1-1 డ్రాతో ఒక్క పాయింట్ దక్కించుకుంది.

మ్యాచ్‌కు ఇరవై నిమిషాలు కూడా పూర్తి కాకముందే చెల్సీ జట్టుకి భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. మొయిసెస్ కైసెడో, మికెల్ మెరినోపై స్టడ్స్-అప్ టాకిల్ చేయడంతో మొదట యెల్లో కార్డు చూపిన రిఫరీ, విఏఆర్ రివ్యూ తర్వాత నేరుగా రెడ్ కార్డు చూపించారు. ఈ సీజన్‌లో చెల్సీ జట్టు నుంచి నాలుగో ఆటగాడు మైదానం విడిచి వెళ్లిన సంఘటన ఇది.

ఒక ప్లేయర్ తక్కువైనా చెల్సీ జట్టు ధైర్యం వీడలేదు. సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే రీస్ జేమ్స్ తీసిన కార్నర్‌కు ట్రెవో చలోబా అద్భుతమైన హెడర్‌తో గోల్ చేసి జట్టును 1-0తో ముందుంచాడు.

అయితే ఆ ఆధిక్యం ఎక్కువ సేపు నిలబడలేదు. బుకయో సాకా కుడి వైపు నుంచి అద్భుతమైన క్రాస్ ఇవ్వగానే, మెరినో ఫార్ కార్నర్‌లోకి హెడర్ ఖాయం చేసి స్కోరు 1-1కి సమంగా మార్చాడు.

మిగతా అరగంట సేపు 11 మందితో ఉన్న ఆర్సెనల్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చెల్సీ జట్టు డిఫెన్స్ గట్టిగా నిలబడటంతో గన్నర్స్‌కు గోల్ దక్కలేదు. మెరినో ఒక్కసారి బాక్స్ ఎడ్జి నుంచి షాట్ కొట్టగా, చెల్సీ జట్టు గోల్కీపర్ రాబర్ట్ శాంచెజ్ అద్భుతంగా సేవ్ చేశాడు.

ఆర్సెనల్ జట్టు ఈ మ్యాచ్‌కు తమ మెయిన్ సెంటర్ బ్యాక్ జోడీ విలియం సాలిబా, గాబ్రియెల్ మగల్హేస్ లేకుండానే బరిలోకి దిగింది. లీగ్‌లో 162 మ్యాచ్‌ల తర్వాత రెండోసారి మాత్రమే ఈ జోడీ లేకుండా ఆడారు.

చెల్సీ అభిమానులు మాత్రం ఒక నిర్ణయంపై మండిపడ్డారు. ఆర్సెనల్ డిఫెండర్ పియెరో హింకాపీ చలోబాపై ఎల్బో కొట్టినా కేవలం యెల్లో కార్డు మాత్రమే చూపినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషాల్లో సబ్‌స్టిట్యూట్ లియామ్ డెలాప్ షాట్‌ను ఆర్సెనల్ గోల్కీపర్ డేవిడ్ రాయా ఆండ్రూ సేవ్ చేశాడు. చివరకి 10 మందితోనే అద్భుతమైన పోరాటం చేసిన చెల్సీ జట్టుకి స్టామ్‌ఫోర్డ్ బ్రిడ్జ్ నిండా అభినందనలు లభించాయి.

ఈ ఫలితంతో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సెనల్ జట్టు ఇప్పుడు ఐదు పాయింట్లకు తగ్గింది. శనివారం లీడ్స్‌ను చిత్తు చేసిన మాంచెస్టర్ సిటీ, చెల్సీని దాటుకుని రెండో స్థానానికి చేరుకుంది.