
11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ఆదివారం ఆదిలాబాద్‌లోని స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పార్లమెంటు సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మా బొజ్జుతో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు కీర్తి తీసుకొచ్చే క్రీడాకారులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, వివిధ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు యువ క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు.
