
101 నగరాల్లో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’పై కాగ్ ఆడిట్
భారత ప్రజల జీవన సౌలభ్యం ఎంత మెరుగైంది? నగరాల్లో ఇల్లు, తాగునీరు, రవాణా సౌకర్యం ఏమాత్రం మెరుగుపడింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) భారీ ఎత్తున సమాచారం సేకరించడానికి క్షేత్రస్థాయిలోకి వెళుతోంది. 2026-27 నుంచి దేశవ్యాప్తంగా 101 నగరాల్లో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ పేరిట స్పెషల్ పర్ఫార్మెన్స్ ఆడిట్ చేపడుతామని సీఏజీ కె. సంజయ్ మూర్తి బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఇది మూడు-నాలుగేళ్ల పాటు దశలవారీగా జరుగుతుంది. షార్ట్ స్టడీస్ ద్వారా నిజమైన విషయాలు బయటపెడతాం’ అంటూ ఆయన పేర్కోన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో సీఏజీ అత్యంత కీలకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ ను ఘనంగా ప్రారంభించారు. ఇది దేశంలో కాగ్ నాలుగో స్పెషలైజ్డ్ సెంటర్ కాగా, ఇక్కడే ఆర్థిక ఆడిట్‌ను ఏఐ, డేటా అనలిటిక్స్‌తో పూర్తిగా ఆధునీకరిస్తామని సంజయ్ మూర్తి ధీమా వ్యక్తం చేశారు.
జీఎస్టీ డేటా మొత్తం రియల్ టైమ్‌లోనే ఆడిట్
డిజిటల్ ఇండియా కారణంగా ప్రభుత్వ డేటా మొత్తం ఒకే చోట ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ బెంగళూరులోని సీఈడీఏఆర్, ఢిల్లీలోని సీడీఎంఏ సెంటర్ల ద్వారా ఇప్పటికే జీఎస్టీ డేటా మొత్తం రియల్ టైమ్‌లో ఆడిట్ చేస్తున్నాం. ఇదే విధానాన్ని మిగతా రంగాలకూ విస్తరిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.
ఐఐటీ-మద్రాస్‌లో 5 వేల మంది అధికారులకు ఏఐ ట్రైనింగ్
భవిష్యత్ ఆడిట్ కోసం 5 వేలకుపైగా కాగ్ అధికారులకు ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీలో ఐఐటీ-మద్రాస్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సంజయ్ మూర్తి తెలిపారు.
ఐసీఏఐతో ఒప్పందం
కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మధ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదిరింది. ఆర్థిక ఆడిట్, పీఎస్‌ఈలు, అటానమస్ బాడీస్, పట్టణ స్థానిక సంస్థల ఆడిట్‌లో ఉమ్మడిగా శిక్షణ, పరిశోధన, పబ్లికేషన్స్ చేపడతామని రెండు సంస్థలు ప్రకటించాయి. కాగ్ ఇకపై సాంప్రదాయ ఆడిట్‌కు పరిమితం కాదు. ప్రజల జీవన ప్రమాణాలను పరీక్షించే ‘స్మార్ట్ ఆడిటర్’గా మారబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
