Let's talk: editor@tmv.in
అస్సాంలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి కేటాయింపు

అస్సాంలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి కేటాయింపు

Gaddamidi Naveen
11 జూన్, 2026

దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అస్సాంలో కీలక ముందడుగు వేసింది. గువాహటిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం ప్రభుత్వం కామరూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్‌లో 10.33 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించింది. మంగళవారం నాటి అధికారిక ప్రకటన ప్రకారం, అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఈ భూమికి సంబంధించిన స్వాధీన ధృవీకరణ పత్రాలను టీటీడీ అధికారులకు అందజేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో గతంలోనే ప్రత్యేక చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ట్రస్ట్ బోర్డు కూడా అధికారిక లేఖల ద్వారా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతును అందించాయి. ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణానికి సంబంధించి అతి త్వరలోనే భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ బి.ఆర్. నాయుడు వెల్లడించారు.