Let's talk: editor@tmv.in
10 వేల హీటర్లను పంపిణీ చేసిన సీఎం రేఖా గుప్తా

10 వేల హీటర్లను పంపిణీ చేసిన సీఎం రేఖా గుప్తా

Pinjari Chand
23 నవంబర్, 2025

జాతీయ రాజధాని ఢిల్లీలో చలి పెరిగింది. చలితో పాటు గాలిలో కాలుష్యం కూడా మరింత పెరిగింది. ఢిల్లీ అంతటా ‘ఏర్‌ క్వాలిటీ’ మళ్లీ ‘వెరీ పూర్’‌లోకి చేరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కట్టెలు, బొగ్గుతో చలి కాచుకునే గస్తీ కార్మికులు కూడా వాతావరణ కాలుష్యంలో భాగమవుతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. శనివారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తా ప్రత్యేక అతిథిగా హాజరై 10,000 ఎలక్ట్రిక్ హీటర్లను వివిధ కాలనీవాసులకు అందజేశారు . ప్రభుత్వ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. గస్తీ కార్మికులు కట్టెలు, బొగ్గులు కాల్చకుండా ఈ హీటర్లను ఉపయోగించాలన్న ఉద్దేశంతోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యంతో పోరాటం చేస్తోంది. చలిలో కట్టెలు, బొగ్గులు కాల్చడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో 10 వేల హీటర్లను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఎవరూ కాల్చొద్దు… కాల్చనివ్వొద్దు. కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీ మొత్తం కలిసి పనిచేస్తేనే ఈ సమస్య దూరమవుతుంది అని చెప్పారు.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కట్టెలు కాల్చినా వెంటనే తెలియజేయండి. ప్రభుత్వం పాజిటివ్ దిశలో పనిచేస్తోంది. ప్రజల సహకారం లేకుండా ముందుకు వెళ్లలేం అని స్పష్టం చేశారు.

కఠిన హెచ్చరికలు జారీ చేసిన పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా

పొయ్యిలు, బొగ్గు, బయోగ్యాస్ కాల్చడాన్ని కఠినంగా నిలువరించాలి. కాలనీవాసులకు హీటర్లు ఇస్తున్నాం. ఎవరికైనా అవసరమైతే గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కానీ ప్రజలు తప్పక సహకరించాలి. చెత్త కాల్చినా, వైర్లు కాల్చినా, ఇండస్ట్రీలలో నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే గ్రీన్ యాప్లో సమాచారమివ్వండి అని పిలుపునిచ్చారు. మా లక్ష్యం ఒక్కటే ఢిల్లీలోని 3 కోట్ల మంది స్వచ్ఛమైన గాలి పీల్చాలి అని సిర్సా అన్నారు.

ఢిల్లీలో మరోసారి గాలి నాణ్యత ‘వెరీ పూర్’

శనివారం ఉదయం ఢిల్లీ సగటు ఏక్యూఐ 359గా నమోదైంది. శుక్రవారం 364తో పోలిస్తే కొంచెం తగ్గినా… గాలి నాణ్యత మాత్రం ప్రమాదకరంగానే ఉందని స్పష్టం అయ్యింది. ఐటీవో ప్రాంతం ఏక్యూఐ 370తో ‘వెరీ పూర్’లో ఉండగా, నోయిడా సెక్టర్ 125 వద్ద ఏక్యూఐ 434కి చేరి ‘సీవియర్’ కేటగిరీలో నిలిచింది. నగరం అంతా దట్టమైన పొగమంచు పరుచుకుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

జీఆర్ఏపీ–3వదశ కొనసాగుతోందంటూ అధికారుల హెచ్చరిక

నవంబర్ 11 నుంచి అమల్లో ఉన్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్–III ఢిల్లీలో యథావిధిగా అమల్లో ఉంది. ఇందులో భాగంగా భారీ నిర్మాణాలపై ఆంక్షలు, వాహనాల కదలికపై పర్యవేక్షణ, పారిశ్రామిక యూనిట్ల కార్యకలాపాలపై కఠిన నియంత్రణలు కొనసాగుతున్నాయి. కాలుష్యంపై సాధ్యమైనంతగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందనీ… ప్రజలు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామనీ అధికారులు చెబుతున్నారు.

10 వేల హీటర్లను పంపిణీ చేసిన సీఎం రేఖా గుప్తా - Tholi Paluku