Let's talk: editor@tmv.in
10 రాష్ట్రాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు

10 రాష్ట్రాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు

Pinjari Chand
28 నవంబర్, 2025

మెడికల్ కాలేజీల అనుమతుల కోసం కోట్ల రూపాయల లంచాల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దేశవ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహ ఈ 10 రాష్ట్రాల్లోని 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి అధికారులు దస్తావేజులు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు పెట్టింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని 8 మంది అధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)లోని ఇన్‌స్పెక్షన్ టీమ్ డాక్టర్లు, మధ్యవర్తులు, ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కై ఈ భారీ కుంభకోణం సృష్టించినట్టు సీబీఐ తేల్చింది.

ఏం జరిగింది?

• మెడికల్ కాలేజీల ఇన్‌స్పెక్షన్ తేదీలు, ఎవరు వస్తారో... ఇలాంటి అతి రహస్య సమాచారాన్ని ముందే లీక్ చేస్తూ కోట్లలో లంచాలు వసూలు చేశారు.

• ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మెడికల్ కాలేజీకి అనుకూల రిపోర్టు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఇన్‌స్పెక్టర్లు రూ.55 లక్షలు లంచం తీసుకున్నారని సీబీఐ అరెస్టు చేసింది.

• రహస్య ఫైళ్లను అక్రమంగా కాపీ చేసి, మధ్యవర్తుల ద్వారా కాలేజీలకు అందజేస్తూ లోపాలను దాచిపెట్టేందుకు కాలేజీలు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చాయి.

ఈ కేసులో ఇప్పటికే 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. మొత్తం 34 మందిని నిందితులుగా పేర్కొంది. ఇప్పుడు ఈడీ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గుర్తింపుపై దృష్టి సారించింది. వైద్య విద్యలో ప్రమాణాలు కాపాడాల్సిన ఎన్ఎంసీ అధికారులే లంచం తీసుకుని భవిష్యత్తు డాక్టర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ఘటన... దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

10 రాష్ట్రాల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు - Tholi Paluku