
10 నిమిషాల డెలివరీ సేవలు నిషేధించాలి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా క్విక్-కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ సేవలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, టార్గెట్‌లు పూర్తి చేయాలనే తీవ్ర ఒత్తిడితో ప్రాణాలను పణంగా పెడుతున్న 'గిగ్ వర్కర్ల' (డెలివరీ ఉద్యోగులు) పట్ల ఈ విధానం 'క్రూరత్వం' వంటిదని అభివర్ణించారు.
రాఘవ్ చద్దా మాట్లాడుతూ, డెలివరీ ఉద్యోగులు రోబోలు కాదని, వారు కూడా ఎవరికో ఒకరికి తండ్రి, భర్త, సోదరుడు, కొడుకు అవుతారని, వారి సంక్షేమం గురించి కూడా ఈ సభ ఆలోచించాలని అన్నారు. వినియోగదారులు తమకు 10 నిమిషాల్లో ఆహారం, వస్తువులు అందాలని ఆశిస్తున్నప్పటికీ, ఆ డెలివరీ చేసే ఉద్యోగుల క్షేమం గురించి ఆలోచించాలని నొక్కి చెప్పారు.
జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు, అలాగే ఓలా, ఊబర్ వంటి రైడ్-హైలింగ్ సేవలు అందించే డ్రైవర్లు, హోమ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో పనిచేసే వారందరినీ ఆయన "భారత ఆర్థిక వ్యవస్థకు కనిపించని చక్రాలు"గా అభివర్ణించారు. సెల్ ఫోన్‌లో ఒక బటన్ నొక్కగానే ఆర్డర్ తమ వద్దకు చేరుతుందని నోటిఫికేషన్ వస్తుందని, కానీ ఆ నోటిఫికేషన్ వెనుక, మనం పట్టించుకోని ఒక వ్యక్తి ప్రాణాలు పణంగా పెడుతున్నాడని ఆయన అన్నారు. క్విక్-కామర్స్, ఇన్‌స్టంట్ డెలివరీ సేవలు కంపెనీలకు వేల కోట్ల వ్యాపార విలువను, 'యూనికార్న్' హోదాలను తెచ్చిపెట్టాయని, కానీ గిగ్ వర్కర్ల పరిస్థితి మాత్రం రోజువారీ కూలీల కంటే దారుణంగా ఉందని రాఘవ్ చద్దా ఆందోళన వ్యక్తం చేశారు.
10 నిమిషాల డెలివరీ టార్గెట్ కారణంగా ఉద్యోగులు అతి వేగంగా వెళ్లాల్సి వస్తుందని, రెడ్ లైట్లను కూడా దాటాల్సి వస్తుందని రాఘవ్ చద్దా అన్నారు. ఆలస్యమైతే రేటింగ్‌లు పడిపోవడం, ఇన్సెంటివ్‌లు కోత పడటం, యాప్ లాగౌట్ లేదా ఐడీ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉండటంతో వారు ప్రాణాలకు తెగించి డెలివరీ చేస్తున్నారని వివరించారు. డెలివరీ ఆలస్యమైనా (5-7 నిమిషాలు ఆలస్యమైనా), కస్టమర్ల నుంచి తిట్లు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని, 1-స్టార్ రేటింగ్ వేయడం ద్వారా వారి నెలవారీ పనితీరు, సంపాదన దెబ్బతింటుందని అన్నారు. ఈ ఉద్యోగులు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నారని, ఎన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నా వారికి రక్షణ పరికరాలు, ప్రత్యేక బోనస్‌లు లేదా ప్రమాద భత్యాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఫ్యాక్టరీ కార్మికులకు ఉన్నట్లుగా వీరికి శాశ్వత ఉపాధి, మానవీయ పని పరిస్థితులు, ఆరోగ్య లేదా ప్రమాద బీమా వంటి రక్షణలు ఏవీ లేవని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఈ బాధనంతటినీ దాచుకుని, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత కూడా వారు నవ్వుతూ "సార్, థాంక్యూ, 5-స్టార్ రేటింగ్ ఇవ్వండి" అని వేడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 10 నిమిషాల డెలివరీ విధానాన్ని అంతం చేసి, ఈ గిగ్ వర్కర్లకు శాశ్వత ఉపాధి, సరైన వేతనాలు, ఆరోగ్య ప్రమాద బీమా వంటి కనీస సామాజిక భద్రతను కల్పించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
