
1న చంద్రబాబు విజయనగరం రాక
అక్టోబర్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో, దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ముందుగా హెలిపాడ్ స్థలాన్ని, మ్యాప్ లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇతర అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, కాలువను శుభ్రం చేయాలని, రోడ్లను మరమ్మతు చేయాలని, ప్రక్కనున్న గోతులను పూడ్పించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనుండటంతో, లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారి పేర్లను ఖరారు చేశారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని కలెక్టర్ సందర్శించారు. స్టేజ్ ఏర్పాట్లపై చర్చించారు. వర్షాలు పడినా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీఐపీ లాంజ్ ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీపంలో ఉన్న జెడ్పీ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, అన్ని శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
