
‘గ్రూప్-1’పై బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్వి అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. గ్రూప్-1 పోస్టులను రద్దు చేయడానికి కారణం పోస్టులను అమ్ముకోవడమే అంటూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్వీ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అర్హత లేని వారికి గ్రూప్-1 పోస్టులు ఇచ్చారని ఆరోపిస్తూ వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం నుంచి నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ‘రూ.3 కోట్లు కొట్టు.. గ్రూప్-1 పట్టు’ అంటూ నినాదాలు చేశారు.
అర్హత లేని వారికి కూడా గ్రూప్-1 పోస్టును అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాల పేరుతో రూ.1,700 కోట్ల భారీ స్కాం చేసింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఇదే పనిగా ఉన్నారని తెలిపారు. రెండు పరీక్ష హాల్లో పరీక్ష రాసిన విద్యార్థులకు ఒకేలా మార్కులు రావడంపై కాంగ్రెస్ ప్రభుత్వ హస్తముందని, ఆ పోస్టులను ముందుగానే అమ్ముకున్నారనే విషయం బట్టబయలైందని విమర్శించారు. కాంగ్రెస్ ఉద్యోగాల నియామకాల పేరుతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం తప్పుడు మాటలే అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క జాబ్ నోటిఫికేషన్ వేయకుండా విద్యార్థులను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
