Let's talk: editor@tmv.in
నేపాల్ లో మార్పులు- భవిష్యత్తు

నేపాల్ లో మార్పులు- భవిష్యత్తు

Dr.Chokka Lingam
14 సెప్టెంబర్, 2025

ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనలు తగ్గుముఖం పట్టిన తర్వాత నేపాల్కు కొత్త ప్రధాని నియమితులయ్యారు. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి ఇప్పుడు నేపాల్ తొలి మహిళా ప్రధాని కూడా అయ్యారు. జెన్ జెడ్ నిరసనకారులు, నాయకులు, న్యాయనిపుణులు, నేపాల్ ప్రెసిడెంట్ పౌడెల్ సహా అందరి నుంచి సుశీలా కార్కికి ఆమోదం లభించింది. ఆమె ఎంతకాలం పదవిలో ఉంటారు, నేపాల్ శాంతి భద్రతలను ఎలా పరిరక్షిస్తారు? జెన్ జెడ్ అసంతృప్తులను ఎలా తీరుస్తారు వంటివి ఇకపై తేలాల్సి ఉంది. అయితే అసలు నేపాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత ప్రబలడానికి, రాత్రికి రాత్రి ప్రభుత్వాలు మారిపోవడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయన్నది మాత్రం కచ్చితంగా ప్రపంచదేశాలు తెలుసుకోవాలి. తమ దేశంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా గుణపాఠాలు నేర్చుకోవాలి.

అసలు నేపాల్లాంటి దేశంలో ఇలాంటి ఆందోళనలు తలెత్తడం సాధారణమైన విషయం కాదు. ప్రజాస్వామ్యపరంగా చూస్తే నేపాల్ వయసు చాలా తక్కువ. కేవలం 17ఏళ్ల క్రితమే అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. కానీ ఈ 17 ఏళ్ల కాలంలో 14 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ లెక్క చాలు నేపాల్లో రాజకీయ అస్థిరత్వం ఎంత ఉందో అర్ధం చేసుకోవడానికి. ఈ పరిస్థితులను, రాజకీయ నేతల అవినీతిని తట్టుకోలేక కొన్ని నెలల క్రితమే నేపాల్ ప్రజలు తమకు మళ్లీ రాచరికం తరహా పాలన కావాలని కోరుతూ వీధుల్లోకొచ్చారు. ఆ ఆందోళన వెంటనే తగ్గుముఖం పట్టినప్పటికీ జెన్ జెడ్ ఆందోళన మాత్రం పదవుల్లో ఉన్న నేపాల్ కీలక నేతలను గద్దె దింపింది.

ఈ ఆందోళన మొదలవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాపై విధించిన నిషేధం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం లక్షలమంది నేపాలీయులకు ఆగ్రహం తెప్పించింది. కమ్యూనికేషన్ కోసం వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేపాల్ ప్రజల్లో 55శాతానికి నెట్ యాక్సిస్ ఉండగా వారిలో 50శాతం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు. ఈ నిషేధంతో 14 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న జెన్ జెడ్ వీధుల్లోకొచ్చింది. అప్పటికే రాజకీయ అవినీతితో విసిగిపోయి ఉన్న యువత సోషల్ మీడియాపై కాదు అవినీతిపై నిషేధం విధించడంటూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. నెపో బేబీ అంటూ రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. సెప్టెంబరు 8న మొదలైన నిరసనలు 9వతేదీన తీవ్ర రూపు దాల్చి నేపాల్ చరిత్రను మార్చివేశాయి. పార్లమెంట్పైన, నేపాల్ నాయకుల ఇళ్లపైనా ఆందోళనకారులు దాడులు చేశారు. రాచరికం సమయంలో కూడా ప్రజల్లో ఈ స్థాయి ఆగ్రహం చూడలేదని స్థానికులు అన్నారంటే అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో పాటు, మాజీ ప్రధానులపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. ఆసియాలో అవినీతి దేశాల జాబితాలో నేపాల్ మొదటిస్థానంలో ఉంది.

కోవిడ్ తర్వాత పర్యాటకంగా నేపాల్ కొంచెం కొంచెం కోలుకుంటోంది గానీ యువతకు సరిపడా ఉపాధి, జీతాలు లేవు. రాజకీయ అస్థిరతతో పారిశ్రామికరంగం అభివృద్ధి చెందడం లేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఎక్కువమంది యువత భారత్తో పాటు ఇతర దేశాలకు వలస పోతున్నారు. విద్యార్థులు నేపాల్లో కాకుండా ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో చదువుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. 2021లెక్కల ప్రకారం 31లక్షలమంది నేపాలీలు విదేశాల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగం, జీవన ప్రమాణాలు పెరగకపోవడం, అదే సమయంలో రాజకీయ నేతల భారీ అవినీతి ప్రజలను తమంతటతాముగా వీధుల్లోకి తెచ్చింది. ప్రభుత్వాన్ని కూల్చివేసింది.

ఇంతవరకూ బాగానే ఉంది...ఇకముందు ఏం జరుగుతుందన్నదే నేపాల్ భవితవ్యాన్ని నిర్దేశించనుంది. కొత్త ప్రభుత్వం జెన్ జెడ్ సహా ప్రజలందరి ఆకాంక్షలు తీర్చగలిగితే సమస్య ఉండదు. అలా కాకపోతే మరో సంక్షోభం ఏ క్షణమైనా మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అందుకే నేపాల్ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అక్కడి పరిణామాలను నిరంతరం గమనిస్తుండాలి. ఎందుకంటే నేపాల్ కేవలం భారత్కు పొరుగుదేశం మాత్రమే కాదు. చారిత్రకంగా, సంస్కృతి పరంగా, భౌగోళికంగా, రాజకీయంగా రెండు దేశాల మధ్య విడదీయలేని బంధం ఉంది.

భారత్లోని ఐదు రాష్ట్రాలు బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నేపాల్తో 1,750కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటున్నాయి.

రాజకీయంగానూ భారత్కు నేపాల్ చాలా కీలకం. రాచరికం పాలనలో నేపాల్ ఎప్పుడూ భారత్కు అనుకూలంగా ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత నేపాల్ కాస్త చైనాకు దగ్గరియనట్టు కనిపించినా, ఢిల్లీ ఆమోదం లేందే ఖాట్మండ్ అధికారపీఠంపై ఉండలేరన్న వాదన వినిపిస్తుంటుంది. నిజానికి ఓ పొరుగు దేశంలో సంక్షోభం భారత్కు ఇప్పుడు కొత్త కాదు. 2022లో శ్రీలంకను, 2024లో బంగ్లాదేశ్ తిరుగుబాట్లను భారత్ గమనించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు భారతే ఆశ్రయమిచ్చింది. కానీ నేపాల్ పరిస్థితి కాస్త భిన్నం. నేపాల్తో భారత ప్రజలకు ఉన్న అనుబంధం దానికి కారణం. అందుకే తాజా ఆందోళనలు భారత్ను దిగ్భ్రాంత పరిచాయి. ఇప్పుడు రాజీనామా చేసి ఉండకపోతే మరో వారంలో ఓలీ భారత పర్యటనకు రావాల్సి ఉంది. ఇంతలోనే నేపాల్ రాజకీయాల్లో పెనుమార్పులు జరిగాయి.

భారత్, నేపాల్ మధ్య ప్రజలు వీసా, పాస్పోర్టులతో పనిలేకుండా స్వేచ్ఛగా సంచరించవచ్చు. నేపాలీలో భారత పౌరుల్లానే ఎలాంటి ఆంక్షలూ లేకుండా ఇక్కడ పనిచేసుకోవచ్చు. నేపాల్కు చెందిన 32వేలమంది గూర్ఖా సైనికులు భారత ఆర్మీలో పనిచేస్తున్నారు. భారత్ నుంచి లక్షలమంది భక్తులు ఏటా నేపాల్ వెళ్తుంటారు. నేపాల్కు భారత్ ఎగుమతులే ఆధారం. ప్రస్తుతానికి ఆందోళనలు శాంతించాయి. అయితే కొత్త ప్రభుత్వంతో సంబంధాల విషయంలో భారత్ జాగరూకతతో వ్యవహరించాలి. నేపాల్ ప్రజలకు ఆగ్రహం ఉన్న మూడు ప్రధాన రాజకీయపార్టీలకు భారత్తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని అయిన సుశీలా కార్కి కూడా భారత్లోనే చదువుకున్నారు. ప్రధాని పదవికి ఎంపికయ్యేముందే భారత్తో ఉన్న అనుబంధాన్ని ఆమె ప్రపంచానికి తెలియజేశారు.

నేపాల్ వ్యవహారాల్లో భారత్, చైనా మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంటుంది. ప్రస్తుతానికి భారత్, చైనా సంబంధాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే సమస్యలేమీ లేవు. అలాగే ప్రజల ఆందోళనల్లో భారత్ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదని కాబట్టి తాజా పరిణామాలను చూసి భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రస్తుతం ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాబోయే పరిణామాలను అంచనావేస్తుండాలని రాజకీయ నిపుణలు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని గద్దెదించడంతో నేపాలీలు సంతృప్తి చెందుతారా లేక రాచరికం కోసం మళ్లీ వీధుల్లోకి వస్తారా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ నేపాల్ అంతా ప్రశాంతంగా మారిపోయిందన్న భావనలోకి వెళ్లడం మాత్రం సరికాదు. రానున్న కొన్ని నెలల్లో అక్కడ ఏమైనా జరగొచ్చు.

నేపాల్ లో మార్పులు- భవిష్యత్తు - Tholi Paluku