Let's talk: editor@tmv.in
భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే?

భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే?

Shaik Mohammad Shaffee
13 సెప్టెంబర్, 2025

ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న భారత్-పాక్ మ్యాచ్, టీమిండియాకు కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేయడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్‌ ధుమాల్‌ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లపై ప్రభుత్వ విధానాన్ని ఆయన స్పష్టం చేశారు. ‘భారత్, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదు. కానీ ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్‌లలో మాత్రం ఆడుతుంది’ అని ఆయన అన్నారు. ఆసియా కప్‌లో పాల్గొన్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియాకు త్వరలోనే కొత్త స్పాన్సర్

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ గురించి కూడా అరుణ్‌ ధుమాల్‌ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఫాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్11తో ఉన్న ఒప్పందం ఇటీవల ముగియడంతో ప్రస్తుతం భారత జట్టు ప్రధాన స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడుతోంది. ఈ విషయంపై స్పందించిన ధుమాల్‌, ‘కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాం. రాబోయే 2-3 వారాల్లో దీనిపై మీకు ఒక స్పష్టమైన సమాచారం తెలుస్తుంది’ అని వెల్లడించారు.

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు ఆమోదం పొందడంతో డ్రీమ్11 తమ ఒప్పందం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించింది. సెప్టెంబర్ 16 వరకు బిడ్ సమర్పణలకు చివరి తేదీ. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన నాటికి టీమిండియాకు కొత్త స్పాన్సర్ లభించే అవకాశం ఉంది.

భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే? - Tholi Paluku