
భారత్-పాక్ మ్యాచ్పై పిటిషన్
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్లో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై అత్యవసర విచారణ జరపడానికి గురువారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘అదొక ఆట మాత్రమే, దాన్ని జరగనివ్వండి’ అంటూ వ్యాఖ్యానించింది.
పిటిషన్లో ఏముంది?
ఊర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి ఇటీవల జరిగిన సంఘటనలను పిటిషనర్లు ప్రస్తావించారు. పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం జాతీయ గౌరవానికి, ప్రజల మనోభావాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దేశం కోసం సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంతో మనం క్రీడా సంబరాలలో పాల్గొనడం తప్పుడు సందేశాన్ని ఇస్తుందని వారు వాదించారు.
అంతేకాకుండా ఈ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, సాయుధ దళాల ఆత్మస్థైర్యానికి, దేశం మొత్తానికి హానికరం అని పిటిషనర్లు పేర్కొన్నారు. వినోదం కంటే దేశ గౌరవం, పౌరుల భద్రత ముందుంటాయని వారు స్పష్టం చేశారు. అలాగే బీసీసీఐని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావాలని కూడా వారు అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు స్పందన
ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది. న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ’మ్యాచ్ ఆదివారం ఉంది. దయచేసి శుక్రవారం విచారించండి’ అని కోరగా, ధర్మాసనం ‘మ్యాచ్ ఈ ఆదివారం ఉందా? అయితే ఏం చేయాలి? దానిని జరగనివ్వండి. మ్యాచ్ కొనసాగాలి' అని వ్యాఖ్యానించింది. ఈ స్పందనతో పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించినట్లు స్పష్టమైంది.
బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వ వైఖరి
భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్ల వంటి టోర్నమెంట్లు తటస్థ వేదికల్లో జరిగితే అందులో పాల్గొనవచ్చని ప్రభుత్వం అనుమతించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. బహుళ జాతీయ టోర్నమెంట్లను బహిష్కరించడం వల్ల అంతర్జాతీయ క్రికెట్ సంస్థల నుంచి ఆంక్షలు ఎదురయ్యే అవకాశం ఉందని, అది ఆటగాళ్ల కెరీర్కు హానికరం అని బీసీసీఐ గతంలో పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆసియా కప్లో షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందని తేలిపోయింది.
భారత్-పాక్ మ్యాచ్పై అభిమానుల అనాసక్తి!
భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అయితే యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 14న జరిగే దాయాదుల పోరుపై క్రికెట్ అభిమానులు అంతగా ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్కు మరో రెండ్రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. దీనికి పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కారణం అని తెలుస్తోంది.
