Let's talk: editor@tmv.in
హౌసింగ్‌ ప్రాజెక్టు పేరిట భారీ మోసం

హౌసింగ్‌ ప్రాజెక్టు పేరిట భారీ మోసం

Panthagani Anusha
7 నవంబర్, 2025

సొంత ఇల్లు అనే కలను నిజం చేసుకోవాలని ఎన్నో ఏళ్లు కష్టపడి డబ్బు పోగుచేసి తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చూస్తున్న ప్రజల నమ్మకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు డెవలపర్లు వ్యూహాత్మకంగా వారి వద్దనుండి డబ్బు సేకరించి పరారైన సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ముంబైలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాందివలిలో నివసించే 62 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అనిల్ ద్రోన్ ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2018 నుంచి వాడాలా (పడమర)లో “స్కై–31” పేరుతో హౌసింగ్ ప్రాజెక్ట్‌ నిర్మిస్తామని చెప్పి, డెవలపర్‌ సుబ్బరామన్ ఆనంద్ విలయనూర్, ఆయన భార్య ఉమా సుబ్బరామన్, బీ.పి. గంగార్ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు మొత్తం 102 మందినుంచి సుమారు రూ.100 కోట్లు సేకరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక అనిల్ ద్రోన్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా, ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించాల్సిన నిధులను డెవలపర్‌ సుబ్బరామన్ ఆనంద్ విలయనూర్, ఆయన భార్య ఉమా సుబ్బరామన్ తమ వ్యక్తిగత ఖాతాలకు మార్చి వేరే ప్రయోజనాలకు వినియోగించినట్టు అధికారులు తెలిపారు. అంతేకాక ఒకే ఫ్లాట్‌ను ఇద్దరికి విక్రయించి, వారి నుండి కూడా డబ్బు వసూలు చేసినట్లు వివరాలు బయటపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాల విభాగం నిందితులపై మోసం, నమ్మక ద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి డెవలపర్‌ సుబ్బరామన్ ఆనంద్ విలయనూర్, ఆయన భార్య ఉమా సుబ్బరామన్, బీ.పి. గంగార్ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.