Let's talk: editor@tmv.in
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!
హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!

హోర్ముజ్ దిగ్బంధం.. గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు!

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతూ ఆ దేశ ఓడరేవులన్నింటినీ దిగ్బంధించేందుకు రంగం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నౌకాదళ దిగ్బంధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ముఖ్యంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా స్తంభించే పరిస్థితులు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా 'దిగ్బంధం'.. ఇరాన్ 'ప్రతిఘటన'

అమెరికా సెంట్రల్ కమాండ్ తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇరాన్ తీరాలకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే అన్ని దేశాల నౌకలను అడ్డుకోనున్నారు. అయితే ఇతర దేశాల మధ్య జరిగే వాణిజ్య నౌకల రాకపోకలకు హోర్ముజ్ జలసంధిలో అనుమతినిస్తామని పేర్కొంటూ ట్రంప్ తన మునుపటి కఠిన వైఖరి నుంచి స్వల్పంగా వెనక్కి తగ్గారు. దీనిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పందిస్తూ.. గల్ఫ్ రీజియన్‌లో భద్రత అనేది అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండకూడదని, తమను అడ్డుకుంటే ఏ రేవునూ వదలబోమని స్పష్టంగా ప్రకటించింది.

విఫలమైన ఇస్లామాబాద్ చర్చలు

పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, యురేనియం నిల్వలను అప్పగించాలని, హమాస్-హిజ్బుల్లా వంటి సంస్థలకు నిధులు ఆపాలని అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ తిరస్కరించింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్-అమెరికా దాడుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కాలిబాఫ్ డిమాండ్ చేయడంతో చర్చలు ప్రతిష్టంభనలోకి వెళ్లాయి.

మండిపోతున్న చమురు ధరలు

అమెరికా బ్లాకేడ్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ 102.29 డాలర్లకు ఎగబాకింది. యుద్ధం ప్రారంభానికి ముందు కేవలం 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ ధర.. ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఆకాశాన్నంటుతోంది. చమురు ధరల పెరుగుదల వల్ల యూరప్ దేశాలపై ఇప్పటికే 25 బిలియన్ డాలర్ల అదనపు భారం పడిందని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయన్ ఆందోళన వ్యక్తం చేశారు.

మద్దతుగా నెతన్యాహు.. తటస్థంగా బ్రిటన్, ఫ్రాన్స్

ఇరాన్‌పై అమెరికా తీసుకున్న నౌకా దిగ్బంధం నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతించారు. అయితే బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ మాత్రం దీనికి తాము మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తమ దేశాన్ని ఈ యుద్ధంలోకి లాగడం ఇష్టం లేదని, ప్రస్తుతానికి చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడంపైనే తాము దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా స్పందిస్తూ.. యుద్ధంతో సంబంధం లేకుండా, సముద్ర మార్గంలో ఓడల రాకపోకలు ప్రశాంతంగా సాగేలా చూసేందుకు ఒక ప్రత్యేక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. యుద్ధం ముగిసిన వెంటనే ఈ మార్గంలో భద్రతను పునరుద్ధరించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ మరికొన్ని దేశాలతో కలిసి చర్చలు జరుపుతున్నాయి.

లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ దాడులు

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్‌లో దాడులను ఉధృతం చేశారు. వ్యూహాత్మక ప్రాంతమైన 'బింట్ జ్బైల్' లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. 2024 కాల్పుల విరమణ తర్వాత నిర్దేశించుకున్న సరిహద్దులను దాటి, మరో 8-10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు ప్రకటించారు. దీనివల్ల హిజ్బుల్లా రాకెట్ దాడుల నుంచి ఇజ్రాయెల్ నగరాలను రక్షించుకోవచ్చని ఆయన సమర్థించుకున్నారు.

ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ హెచ్చరిక

ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో యెమెన్ నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరిగిందని, ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని అన్నారు. అవసరమైతే తమ మద్దతుదారులైన హౌతీ తిరుగుబాటుదారులు 'బాబ్ ఎల్-మండెబ్' జలసంధిని మూసివేస్తారని, తద్వారా అమెరికాకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ట్రంప్ బెదిరింపులు ఉత్తవే: ఇరాన్ ధీమా

అమెరికా చేస్తున్న దిగ్బంధం హెచ్చరికలు కేవలం "బ్లఫ్" అని ఇరాన్ భద్రతా మండలి ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ కొట్టిపారేశారు. ట్రంప్ కేవలం మార్కెట్‌ను భయపెట్టేందుకు ఇలా చేస్తున్నారని, ఒకవేళ యుద్ధం వస్తే తాము ఇప్పటివరకు వాడని అస్త్రాలను ప్రయోగిస్తామని ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల మధ్య మాటల యుద్దం ముదురుతుండటంతో గల్ఫ్ రీజియన్ రణరంగాన్ని తలపిస్తోంది.

యుద్ధ క్షేత్రంగా మారిన జలసంధి

హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉంది. చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు ఇక్కడ ‘సీ మైన్స్’ తొలగింపు ప్రక్రియ చేపట్టాయని అమెరికా సైన్యం చెబుతుండగా, ఇరాన్ దానిని ఖండించింది.

రష్యా ఆందోళన

హోర్ముజ్ దిగ్బంధంపై రష్యా స్పందిస్తూ.. ఇది అంతర్జాతీయ మార్కెట్లను కుప్పకూలుస్తుందని హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్ కాల్పుల విరమణను మరో 45 నుంచి 60 రోజులు పొడిగిస్తే చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అణు కార్యక్రమమే అసలు పేచీ

యుద్ధం మొదలవ్వక ముందు నుంచే ఇరాన్ అణు కార్యక్రమం ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. తమది శాంతియుత అవసరాల కోసమేనని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అది అణ్వాయుధ తయారీకి చేరువలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. 2015 నాటి అణు ఒప్పందం నుంచి ట్రంప్ గతంలో వైదొలగడం ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేసింది.

అగ్నిగుండంగా మారుతున్న గల్ఫ్

ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగియనుంది. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చల వైఫల్యం తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఈ భీకర యుద్ధం వల్ల ఇప్పటివరకు ఇరాన్, లెబనాన్లలో వేల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. కాల్పుల విరమణ పొడిగింపు జరగకపోతే పశ్చిమాసియా మరింత సంక్షోభంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.