Let's talk: editor@tmv.in
హోర్ముజ్ దాటిన మరో భారత ట్యాంకర్

హోర్ముజ్ దాటిన మరో భారత ట్యాంకర్

Pinjari Chand
12 ఏప్రిల్, 2026

అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత భారత జెండా కలిగిన ఎల్‌పీజీ ట్యాంకర్ జగ్‌ విక్రమ్ ఎల్పీజీ ట్యాంకర్‌‌ వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్‌ జలసంధిని దాటింది. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారత నౌక ఇదేనని షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం మధ్య ఈ నౌక జలసంధిని దాటి ప్రస్తుతం గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో తూర్పు దిశగా ప్రయాణిస్తోంది.

గల్ఫ్‌లో ఇంకా భారత నౌకలు

ఈ సంఘటనకు ముందు మార్చి ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది భారత నౌకలు పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి బయటకు వచ్చాయి. ఇంకా సుమారు 15 భారత జెండా నౌకలు అక్కడే ఉండి మార్గం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ ట్యాంకర్ ముంబైకి చెందిన గ్రేట్‌ ఈస్ట్రన్‌ షిప్పింగ్‌ కంపెనీ సంస్థకు చెందింది. ఇది సుమారు 26,000 టన్నుల సామర్థ్యం కలిగిన గ్యాస్ క్యారియర్. ఇందులో సుమారు 20,000 టన్నుల ఎల్‌పీజీ ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన నౌకలు

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పుడు 28 భారత నౌకలు హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉండేవి. వాటిలో 24 నౌకలు జలసంధి పశ్చిమ భాగంలో, నాలుగు తూర్పు భాగంలో ఉన్నాయి. అంతర్జాతీయ షిప్ ట్రాకింగ్ సంస్థ మెరైన్‌ ట్రాఫిక్‌ డేటా ప్రకారం ఈ ప్రాంతంలో ఇంకా వందలాది నౌకలు ఉన్నాయి. వాటిలో 426 ఆయిల్ ట్యాంకర్లు, 34 ఎల్‌పీజీ క్యారియర్లు, 19 ఎల్‌ఎన్‌జీ నౌకలు ఉన్నాయి.

భారత్‌కు కీలక మార్గం

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగ దేశమైన భారత్ తన అవసరాలకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. దేశం ముడి చమురు అవసరాల్లో సుమారు 88%, సహజ వాయువు అవసరాల్లో సగం, ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ సరఫరాల్లో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచి వచ్చి హర్ముజ్‌ మార్గం గుండా వస్తుంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల సమయంలో ఈ మార్గం తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ సముద్ర మార్గాన్ని మళ్లీ నౌకాయానానికి తెరిచారు. దీంతో గల్ఫ్ నుంచి ఇంధన సరఫరాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.