Let's talk: editor@tmv.in
హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించండి.. ట్రంప్ కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించండి.. ట్రంప్ కీలక ఆదేశాలు

Shaik Mohammad Shaffee
13 ఏప్రిల్, 2026

ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఇరాన్‌-అమెరికా శాంతి చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ‘మారథాన్’ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని తక్షణమే దిగ్బంధించాలని తన నౌకాదళాన్ని ఆదేశించారు. దీంతో ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టయిన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.

ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ

ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హోర్ముజ్ జలసంధిపై పట్టు బిగించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వెన్నుముకను విరవాలని ట్రంప్ వ్యూహరచన చేశారు. "జలసంధిని తెరుస్తామని మాట ఇచ్చి ఇరాన్ తప్పింది. అందుకే అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు రవాణా పన్ను (టోల్) చెల్లించే ఏ నౌకనైనా అడ్డుకోవాలని, వాటిని స్వాధీనం చేసుకోవాలని నేవీకి ఆదేశించాను. అక్రమ టోల్ కట్టేవారికి సముద్రంలో రక్షణ ఉండదు" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే ధ్వంసమైందని, వారి వద్ద ఎటువంటి శక్తి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

అణు అస్త్రమే అసలు పేచీ

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చలు ప్రధానంగా అణు కార్యక్రమాల చుట్టూ తిరిగాయి. ఇరాన్ అణు బాంబు తయారీని శాశ్వతంగా విడనాడాలని, అందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబట్టగా.. తమ కార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ వాదించారు. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వెనక్కి తగ్గకపోవడంతో చర్చలువిఫలం అయ్యాయి. ఏప్రిల్ 22తో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

లెబనాన్‌పై ఆగని దాడులు

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్‌లో 3,000 మంది, లెబనాన్‌లో 2,020 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నప్పటికీ, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ తన భీకర దాడులను ఆపడం లేదు. ఆదివారం జరిగిన దాడిలో ఆరుగురు చనిపోగా, కాల్పుల విరమణ ప్రకటించిన రోజే బీరూట్‌పై బాంబుల వర్షం కురిపించి 300 మందిని ఇజ్రాయెల్ బలిగొంది. రానున్న మంగళవారం వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉన్నా.. హిజ్బుల్లాను నిరాయుధులను చేసే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

పర్షియన్ గల్ఫ్‌లో ఇప్పటికే అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమాన వాహక నౌకలు ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’, ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ మోహరించి ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి సంధి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరు దేశాల మొండి వైఖరి వల్ల శాంతి అనేది అందని ద్రాక్షలాగే కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో సాధించలేనిది చర్చల ద్వారా సాధించాలని అమెరికా చూస్తోందని ఇరాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.