
హోరాహోరీగా పుదుచ్చేరీలో ప్రచారం
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తట్టంచావడి నియోజకవర్గంలో ప్రధాన పోటీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, కాంగ్రెస్ నేత వీ.వైతిలింగం మధ్య నెలకొంది. 75 ఏళ్ల వైతిలింగం గట్టి పోటీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తట్టంచావడి ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ‘అన్బన వాక్కల పెరుమక్కలే’ (ప్రియమైన ఓటర్లారా) అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రచారం సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడైన వైతిలింగం ఓటర్లను కలుస్తున్నారు. రంగస్వామి ప్రభావం బలంగా ఉన్నప్పటికీ, తాను గెలిస్తే మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. తట్టంచావడిలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ రంగసామి, వైతిలింగం మధ్యే జరుగుతోంది.
ప్రజల స్పందన
అవ్వై నగర్ ప్రాంతానికి చెందిన ఓటరు ఎం. వాజ్వుముని మాట్లాడుతూ వైతిలింగం చాలా కాలంగా పరిచయం ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారని అన్నారు. అయితే మరికొందరు స్థానికులు మాత్రం పోటీ చాలా కఠినంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి రంగస్వామిని అభిమానులు ‘మక్కళన్ ముదల్‌వార్ ’(ప్రజల ముఖ్యమంత్రి) అని పిలుస్తారని, ఆయన పాలన సాధారణ ప్రజలకు అనుకూలమని కొందరు పేర్కొన్నారు. రంగస్వామి ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి ఆయన తట్టంచావడి, మంగళం అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో ఆయన తట్టంచావడి నుంచి గెలిచారు.
కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందన్న వైతిలింగం
ప్రచార సమయంలో మీడియాతో మాట్లాడిన వైతిలింగం, ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఐదేళ్లుగా తమ పార్టీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రంగస్వామి, హోంమంత్రి నామశివాయం, స్పీకర్ ఎంబలం ఆర్. సెల్వంలపై కాంగ్రెస్ నిరంతరం పోరాడుతోందని చెప్పారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి లేదా ఇతర నేతలను నేరుగా కలిసే అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా ఉందని ఆరోపించారు. ప్రజలతో మాట్లాడేందుకు ప్రతినిధులను పంపడం ‘ఏజెంట్ ప్రభుత్వంలా’ మారిందని విమర్శించారు. ఉపాధి అవకాశాల లేమి ప్రధాన సమస్యగా ఉందని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేక యువతలో నిరాశ పెరుగుతోందని చెప్పారు. స్థానికులు కూడా ఉద్యోగాల కోసం చాలా మంది యువకులు చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలకు మద్దతు
అయితే కొంతమంది మహిళలు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం నెలకు రూ.1,000 నుంచి రూ.2,500కు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళలకు ఈ-టూ వీలర్ కొనుగోలుకు 75 శాతం సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు అధికార పార్టీ అనుచరులు చెప్పారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.
కూటమి, అంతర్గత విభేదాలు
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల ఆరోపణలపై వైతిలింగం స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వీ.రంగస్వామి కు టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. నెల్లితోపు నియోజకవర్గాన్ని డీఎంకే వదులుకోకపోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని తెలిపారు. మొత్తం 30 స్థానాల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో, డీఎంకే 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉజవర్కరై స్థానాన్ని విడుతలై చిరుతైగల్ కట్చికు కేటాయించారు. సీట్ల పంపకంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య మొదట విభేదాలు ఉన్నప్పటికీ చివరికి పరిష్కారం అయ్యాయని వైతిలింగం చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కొందరు స్థానికులు మాత్రం కేంద్రంపై అధికంగా ఆధారపడటం, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా రాకపోవడం వంటి అసలు సమస్యలపై రాజకీయ నాయకులు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
