
హోటల్ బిల్లుల్లో గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: సీసీపీఏ
హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేశాక బిల్లులో 'ఎల్పీజీ ఛార్జీలు', 'ఫ్యూయల్ కాస్ట్ రికవరీ' పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) బుధవారం హోటల్ యాజమాన్యాలను హెచ్చరించింది. ఇలాంటి అదనపు వసూళ్లను సహించమని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం మెనూలో పేర్కొన్న ధర, దానికి వర్తించే పన్నులు మినహా మరే ఇతర ఛార్జీలను బిల్లులో కలపకూడదని తేల్చి చెప్పింది.
సర్వీస్ ఛార్జీకి బదులు కొత్త పేర్లు
గతంలో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో వసూలు చేయకూడదని ఇచ్చిన మార్గదర్శకాలను పక్కదారి పట్టించేందుకు కొన్ని హోటళ్లు ఇప్పుడు 'గ్యాస్ సర్‌ఛార్జ్', 'ఎల్పీజీ ఛార్జీలు' వంటి కొత్త పేర్లతో బిల్లులను పెంచుతున్నట్లు సీసీపీఏ గుర్తించింది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు అందుతున్న ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా ఈ ధోరణి పెరుగుతోందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వినియోగదారుడికి తెలియకుండా ఇలాంటి ఛార్జీలను బిల్లులో చేర్చడం పారదర్శకతకు విరుద్ధమని, ఇది కస్టమర్లపై అదనపు భారం మోపడమేనని అభిప్రాయపడింది.
ధరలోనే అన్నీ ఉండాలి.. విడిగా వసూలు వద్దు!
వ్యాపార నిర్వహణకు అవసరమయ్యే ఇంధనం, ఎల్పీజీ, విద్యుత్ వంటి ఖర్చులన్నీ హోటల్ నిర్వహణ ఖర్చుల్లోనే భాగమని, వాటిని ముందే లెక్కించి మెనూలోని వస్తువుల ధరలను నిర్ణయించాలని సీసీపీఏ స్పష్టం చేసింది. మెనూలో ప్రదర్శించే ధరలే అంతిమమని, వాటికి కేవలం పన్నులు మాత్రమే అదనమని తెలిపింది. ఆపరేషనల్ ఖర్చులను విడివిడిగా వినియోగదారుల నుండి వసూలు చేయడం చట్టరీత్యా తప్పని పేర్కొంది.
వినియోగదారులపై ఒత్తిడి తగదు
ఏదైనా అదనపు రుసుము అనేది వినియోగదారుడి ఇష్టపూర్వకంగా ఉండాలే తప్ప, తప్పనిసరిగా చెల్లించాలని బలవంతం చేయకూడదని సీసీపీఏ హెచ్చరించింది. 2022 జూలై 4న విడుదల చేసిన మార్గదర్శకాలను ఏ రూపంలో ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని సంస్థ తాజా అడ్వైజరీలో పేర్కొంది. వినియోగదారులు కూడా ఇలాంటి అక్రమ వసూళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
