Let's talk: editor@tmv.in
హోం మినిష్టర్‌కు అడ్డుపడ్డ మత్స్యకారులు

హోం మినిష్టర్‌కు అడ్డుపడ్డ మత్స్యకారులు

FL - YUGDR
1 అక్టోబర్, 2025

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో హోంమంత్రి వంగలపూడి అనితకు మత్స్యకారుల నిరసన సెగ గట్టిగా తగిలింది. గత పదహారు రోజులుగా బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్షలో ఉన్న మత్స్యకారులు, హోంమంత్రి రాకతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి హోంమంత్రి కాన్వాయ్ను ఆపేసి, “పనులు నిలిపివేయకపోతే మేము వెనక్కి తగ్గం" అని స్పష్టంగా హెచ్చరిం చారు.

ఆమె వాహన శ్రేణికి తాటి చెట్టు నరికి అడ్డంగా పడేశారు. బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపకుండా తమ వద్దకు రావడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ప్రజలందరూ మూకుమ్మడిగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన తిరుగుబాటుగానే ఈ ఆందోళనను పరిణించాలి.ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోం మంత్రి అనిత సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి, ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినా ప్రజలు అనితను విడిచి పెట్టలేదు.

కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన ఆందోళన కారులు తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవ డానికి ప్రయత్నించినా, మత్స్యకారులు భారీ సంఖ్యలో చేరి హోంమంత్రి కాన్వాయ్ను ఘెరావ్ చేశారు. చివరికి హోంమంత్రి "సీఎంతో చర్చలు జరిగేంతవరకు పనులు నిలిపివే స్తాం" అని హామీ ఇచ్చారు. దాంతో కొంత ఉపశమనం వచ్చినప్పటికీ, ప్రజలు మాత్రం బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని ప్రకటిస్తే తప్ప వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పారిశ్రామిక ప్రయోజనాలకు పెద్దపీట వేయడంతో చివరికి జనం హోంమంత్రి పైన తిరుగుబాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

హోం మినిష్టర్‌కు అడ్డుపడ్డ మత్స్యకారులు - Tholi Paluku