
హోంమంత్రికి నైతిక బాధ్యత లేదా? ఢిల్లీ పేలుడు ఘటనపై కేసీ వేణుగోపాల్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారు పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యం. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి బాధ్యత ఎవరిది? హోంమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది అని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. గతంలో ముంబై దాడులు జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు.
గత పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా ఇకపై భారత్‌లో ఉగ్రదాడులు జరగవు అన్నారు. అప్పుడే మేం హెచ్చరించాం. దేశ భద్రతపై అలా తేలికగా మాట్లాడకూడదని. కానీ ఇప్పుడు రాజధానిలోనే ఇంత పెద్ద దాడి జరిగింది. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు అని మండిపడ్డారు.విపక్ష పక్షాలు కూడా హోంమంత్రి రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశాయని ఆయన గుర్తుచేశారు.
శబరిమల బంగారం దొంగతనం కేసుపై విమర్శ
శబరిమల దేవాలయం బంగారం దొంగతనం కేసుపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేరళలోని సీపీఎం ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేవాలయాల ఆస్తులపై కేరళ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. సీపీఎం దేవాలయాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. అయ్యప్ప ఆస్తిని అమ్మేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సీపీఎం కళ్లన్నీ దేవాలయాల ధనం పైనే ఉన్నాయి అని వేణుగోపాల్ మండిపడ్డారు.
పార్టీ నాయకులను ఎందుకు నియమించారు?
భక్తిశ్రద్ధ కలిగిన ప్రయార్ గోపాలకృష్ణన్‌ను దేవాదాయ బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించి, పార్టీ వ్యక్తిని నియమించారు. ఇందుకు కారణం సీఎం చెప్పాలి. ఈ బోర్డులను అవినీతి వేదికలుగా మార్చేశారు. శబరిమల బంగారం దొంగతనం జరిగినా సీఎం మాత్రం సచివాలయంలోనే కూర్చున్నారు అని విమర్శించారు.
బంగారం కేసు తాజా పరిణామాలు
ట్రావెన్ కోర్ దేవాదాయ బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్. వాసును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి, కేసులో మూడో నిందితుడిగా పేర్కొంది. నవంబర్ 7న మాజీ తిరువాభరణం కమిషనర్ కే.ఎస్. బైజును కూడా అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి ఇప్పటికే సిట్ కస్టడీలో ఉన్నారు. సిట్ కేరళ హైకోర్టుకు సమర్పించిన రెండో నివేదికలో ట్రావెన్ కోర్ దేవాదాయ బోర్డు మీటింగ్ రికార్డుల్లో తీవ్రమైన అక్రమాలు ఉన్నాయని వెల్లడించింది.
ఏం జరిగింది అంటే...
1998లో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా శబరిమల అయ్యప్ప ఆలయానికి 30.3 కిలోల బంగారం, 1,900 కిలోల రాగి దానం చేశారు. దీని ద్వారా గర్భగుడి పైభాగం, చెక్క ఆకృతులకు బంగారు పూత పూశారు. తరువాత శుద్ధి కోసం బంగారు పూత తొలగించగా, బంగారం బరువులో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. అప్పటినుంచి ఈ దొంగతనం కేసు తీవ్ర చర్చనీయాంశమైంది.
