
హై కమాండ్ ఏం చెబితే అదే పాటిస్తా: సీఎం సిద్ధరామయ్య
హైకమాండ్ ఏం నిర్ణయిస్తే, నేను అదే పాటిస్తాను. నా దృష్టి పూర్తిగా పాలనపై ఉంది. హైకమాండ్ ఆదేశిస్తే నేను నా పదవీకాలం పూర్తిచేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుపై నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ హైకమాండే చూసుకుంటుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని ఆయన పేర్కోన్నారు.
కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ మార్పు, నాయకత్వ మార్పుపై కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధమని చెప్పారు. చివరికి నిర్ణయం హైకమాండ్‌దే. ఇప్పటివరకు పార్టీ కేంద్ర నేతృత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ఢిల్లీకి వెళ్తారు. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలిపారు.
యతీంద్ర చేసిన వ్యాఖ్యలతోనే
ఇటీవల సీఎం సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలే ముఖ్యమంత్రి పదవి మార్పుపై మళ్లీ చర్చ తెరపైకి రావడానికి కారణమైనది . బెలగావిలో యతీంద్ర మాట్లాడుతూ ప్రజా నిర్మాణ శాఖ మంత్రి సతీష్ జార్కిహోలిని తన తండ్రి సిద్ధరామయ్యకు రాజకీయ వారసుడిగా సూచించారు.
తర్వాత ఆయన వివరణ ఇస్తూ జార్కిహోలి గారు నా తండ్రి ఆహిందా (అల్పసంఖ్యాకులు, హిందూ వెనుకబడిన వర్గాలు, దళితులు) సిద్ధాంతానికి వారసుడు అనే అర్థంలోనే నేను చెప్పాను. ఏ రాజకీయ ఉద్దేశ్యం లేదు అని స్పష్టం చేశారు. తన తండ్రి రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారని 2028 ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పారు. ఆహిందా సిద్ధాంతాన్ని, సెక్యులర్ కాంగ్రెస్ భావజాలాన్ని కొనసాగించే నాయకుడిగా సతీష్ జార్కిహోలి ముందుకు రావాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం మాత్రం తుది నిర్ణయం కేంద్ర హైకమాండ్‌దే అని స్పష్టం చేస్తోంది.
