Let's talk: editor@tmv.in
హైస్పీడ్ హబ్‌గా హైదరాబాద్.. 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
హైస్పీడ్ హబ్‌గా హైదరాబాద్.. 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

హైస్పీడ్ హబ్‌గా హైదరాబాద్.. 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Gaddamidi Naveen
12 జులై, 2026

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం త్వరలోనే దేశంలోనే ఒక అతిపెద్ద "హై-స్పీడ్ హబ్‌"గా మారబోతోందని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏకంగా మూడు ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు కారిడార్లను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 'హైసియా గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ & ఐటీ రౌండ్‌టేబుల్' సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోడీ తెలంగాణ రైల్వే రంగానికి కేటాయించిన రూ. 5,400 కోట్ల బడ్జెట్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను అనుసంధానించే 3 బుల్లెట్ రైలు కారిడార్లు

దేశవ్యాప్తంగా మంజూరైన ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో మూడింటిని హైదరాబాద్‌కే కేటాయించారని, దీనివల్ల ఈ నగరమే అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిందని మంత్రి తెలిపారు.

• హైదరాబాద్ – పూణే

• హైదరాబాద్ – చెన్నై

• హైదరాబాద్ – బెంగళూరు

ఈ మూడు కారిడార్లు యావత్ దక్షిణ భారత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా అనుసంధానించి, పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ బుల్లెట్ రైళ్లను భారతదేశంలోనే డిజైన్ చేసి, తయారు చేస్తున్నారని.. తద్వారా గ్లోబల్ బుల్లెట్ రైల్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ మొదటి విడత వచ్చే ఏడాది ప్రారంభం కానుందని, ఆ తర్వాత మిగిలిన సెక్షన్లను దశలవారీగా ప్రారంభిస్తామని వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, అమరావతి, పూణే, బెంగళూరు నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బుల్లెట్ రైలు నెట్‌వర్క్ ఏర్పడనుందని స్పష్టం చేశారు.

రైల్వే స్టేషన్ల నవ-నిర్మాణం

దేశవ్యాప్తంగా సాగుతున్న ‘నవ-నిర్మాణం’ (స్టేషన్ల పునరాభివృద్ధి) కింద ఇప్పటివరకు 261 స్టేషన్ల ఆధునీకరణ పనులు అపూర్వమైన వేగంతో పూర్తయ్యాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలోని సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా సరికొత్త రూపంలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా స్టేషన్ల రీడెవలప్‌మెంట్ పనులు చేసేటప్పుడు రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారని, కానీ మనం ఇక్కడ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండానే పనులు చేస్తున్నామని తెలిపారు. రైళ్లు నడుస్తుండగానే, ప్లాట్‌ఫారమ్‌లపై కప్పు తరహాలో 'ఎయిర్ కాన్‌కోర్స్' నిర్మిస్తున్నామని.. నాణ్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

బేగంపేట స్టేషన్ ఆధునీకరణ పూర్తయిందని, త్వరలోనే ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్ పనులు కూడా పూర్తయ్యాయని, ప్రజలు అక్కడికి వెళ్లి మంచి కాఫీ తాగుతూ మార్పును గమనించవచ్చన్నారు. వరంగల్, కరీంనగర్ స్టేషన్ల పనులు కూడా పూర్తయ్యాయని.. హైదరాబాద్ (నాంపల్లి), కాజీపేట జంక్షన్, మలక్‌పేట స్టేషన్లలో పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు.

ఈ ఏడాది చివరి నాటికి 400 స్టేషన్లను, వచ్చే ఏడాది చివరి నాటికి 700 స్టేషన్లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం పెయింట్లు వేయడం, రిబ్బన్లు కట్ చేయడానికే పరిమితమయ్యాయని.. కానీ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1,300 పాత స్టేషన్లను పూర్తిగా పునర్నిర్మించే సవాలును స్వీకరించిందని విమర్శించారు.

సెమీకండక్టర్ రంగంలో అవకాశాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది ప్రతిభావంతులైన నిపుణుల కొరత ఉందని, భారత ఐటీ పరిశ్రమ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల దేశంలో ప్రస్తుతం 12 సెమీకండక్టర్ ప్లాంట్లు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయని, అందులో మూడు ప్లాంట్లు ఇప్పటికే చిప్‌ల తయారీని ప్రారంభించాయని వెల్లడించారు. ఇక్కడ తయారవుతున్న చిప్‌లను జపాన్, అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గర్వంగా ప్రకటించారు. ఈ పరిశ్రమకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 315 విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ అందించినట్లు తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలంగాణకు పెద్దపీట

భారతదేశంలో మొబైల్ ఫోన్లు అతిపెద్ద ఎగుమతి వస్తువుగా మారాయని, గత ఏడాది ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దేశంలోనే మూడో అతిపెద్ద ఎగుమతి కేటగిరీగా అవతరించాయని మంత్రి చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రెండంకెల వృద్ధి రేటుతో దూసుకుపోతూ ప్రస్తుతం రూ. 13 లక్షల కోట్లకు చేరిందని, త్వరలోనే ఇది రూ. 20 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ రంగం ప్రస్తుతం 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.

తెలంగాణకు కేంద్రం నుంచి భారీ మద్దతు లభించిందని, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో తెలంగాణలో ప్రస్తుతం 104 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు పనిచేస్తున్నాయని వివరించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి నాలుగు పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను కూడా కేంద్రం మంజూరు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
HyderabadBulletTrainAshwiniVaishnawTelanganaHighSpeedRailIndianRailwaysHyderabadNewsTelanganaNewsVandeBharatRailwayDevelopmentSecunderabad
హైస్పీడ్ హబ్‌గా హైదరాబాద్.. 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ - Tholi Paluku