Let's talk: editor@tmv.in
హైవేలపైకి వచ్చే పశువుల సమస్యపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

హైవేలపైకి వచ్చే పశువుల సమస్యపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై తిరుగుతున్న పశువులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు విక్రంనాథ్‌, సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే యానిమల్‌ వెల్ఫేర్‌‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు ఆవు పన్ను (కౌ సెస్)గా 10 శాతం వసూలు చేస్తున్నప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో నేషనల్ హైవేస్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫు న్యాయవాది మాట్లాడుతూ, రహదారులపై తిరిగే జంతువుల సమస్యపై ఇప్పటికే వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసిందని, అదే అంశాన్ని కూడా ఇందులో పరిగణలోకి తీసుకోవచ్చని తెలిపారు. పిటిషన్‌ దాఖలు చేసిన లాయర్స్‌ ఫర్‌‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇంటర్‌‌నేషనల్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, వీధి కుక్కల కేసు తీర్పుతో ఈ సమస్యలో చాలా భాగం పరిష్కారం కావొచ్చని, అయితే తమ పిటిషన్‌లో మరికొన్ని ప్రత్యేక అంశాలను ప్రస్తావించామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై నోటీసులు జారీ చేసి నాలుగు వారాల తరువాత తదుపరి విచారణకు వాయిదా వేసింది.

పశువులను రోడ్డుపై వదిలితే కఠిన చర్యలు

పిటిషన్‌లో జాతీయ రహదారులపైకి పశువులు రాకుండా నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. అలాగే ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు తప్పనిసరిగా కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదికాక శాస్త్రీయ విధానంలో నిర్వహించే గోశాలలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పశువులను అనధికారంగా వదిలిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. పశువుల వల్ల జరిగే రహదారి ప్రమాదాల బాధితులకు ‘నో ఫాల్ట్‌ కాంపెన్సేషన్‌’ విధానాన్ని అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సీఎస్‌ఆర్‌‌ కింద గోశాలలు ఏర్పాటు చేయాలి

ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరి 29న సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐకు కీలక సూచనలు చేసింది. రహదారుల నిర్మాణంలో భాగంగా పని చేసే సంస్థలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌‌) కింద హైవేల వద్ద గోశాలలను ఏర్పాటు చేసి తిరిగే పశువులను సంరక్షించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. గత ఏడాది నవంబర్‌ 7న, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో కుక్క కాట్ల సంఘటనలు పెరిగిన నేపథ్యంలో, వీధి కుక్కలను గుర్తించిన ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని కోర్టు ఆదేశించింది.

అలాగే వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ చేసిన తరువాత మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలేయరాదని కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై తిరిగే పశువులను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. గత ఏడాది జూలై 28న ఢిల్లీలో పిల్లల్లో రేబీస్‌ వ్యాధికి దారితీసిన కుక్క కాట్ల ఘటనలపై వచ్చిన మీడియా కథనాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తోంది.