
హైదరాబాద్ హెరిటేజ్ రన్ 2026లో జీహెచ్‌ఎంసీ సందడి
నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యావరణను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన 'హైదరాబాద్ హెరిటేజ్ రన్ 2026' లో జీహెచ్‌ఎంసీ బృందం ఉత్సాహంగా పాల్గొంది. స్వచ్ఛ భారత్ మిషన్ పీఐయూ టీమ్ ఈ పరుగులో భాగస్వాములై పౌరులకు కీలకమైన సామాజిక సందేశాలను అందించారు.
వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా అధికారులు నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ బృందం జీరో వ్యర్థాల భావనను ప్రజల్లో విస్తరించింది. పరుగు మార్గం వెంబడి ఏర్పాటు చేసిన అవగాహన స్టాళ్ల ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, చెత్తను వేరు వేరు చేయడం, పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై వివరించారు. ఆకర్షణీయమైన నినాదాలు, సమాచార పత్రికలు, ప్రత్యక్ష చర్చల ద్వారా పాల్గొన్న వారికి బాధ్యతాయుత జీవనశైలిపై సందేశం అందించారు.
ఈ హెరిటేజ్ రన్ కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాకుండా, పర్యావరణ సంరక్షణకు సామూహిక సంకల్పంగా నిలిచింది. నగర వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, క్లీనర్ అండ్ గ్రీనర్ హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ బృందం పిలుపునిచ్చింది. పర్యావరణ హితమైన అలవాట్లను పాటిస్తూ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడమే ఈ పరుగు యొక్క అసలు ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
