
హైదరాబాద్ సీపీగా కొత్త శకం ప్రారంభం
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మంగళవారం అధికారికంగా వీ.సి.సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. వీ.సి.సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా ఇది నాకు లభించిన గొప్ప గౌరవమే కాక, ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ వంటి విస్తృతమైన, ప్రగతిశీలమైన మహానగరానికి శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను మోస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.
శాంతి భద్రతలే మొదటి ప్రాధాన్యత
ఈ నగరంలో ప్రజలందరూ భయభ్రాంతుల్లేకుండా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నదే మా ముఖ్య లక్ష్యం. ఇప్పటికే ఉన్న పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే కాకుండా, అన్ని ప్రాంతాల్లో సత్వర స్పందన, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, సామాజిక న్యాయం సాధనపై దృష్టిపెడతామని తెలిపారు. పోలీసు విధులు కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు. అది ప్రజలతో నడవడం, వారిలో భద్రతా భావన కలిగించడం, మానసిక విలువలతో కూడిన సేవ అందించడం.నా ప్రాధాన్యత ప్రజలకు చేరువ కావడమేన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు సులభంగా పని జరిగేలా, ప్రతి పోలీస్ అధికారులు వినయంగా స్పందించేలా మారుస్తామని తెలిపారు.
సమాజంలోని ప్రతి వర్గాన్ని రక్షించడమే లక్ష్యం
ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, నగరంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఇతర వర్గాలకు పూర్తి రక్షణ కల్పించడమే మా విధానమని పేర్కొన్నారు. మహిళలపై, మానసికంగా బాధించే సంఘటనలు, డ్రగ్ మాఫియా లాంటి ముప్పులను కట్టడి చేయడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
సాంకేతికత ఆధారంగా శక్తివంతమైన పోలీసింగ్
సాంకేతికత ఆధారంగా స్మార్ట్ పోలీసింగ్ మా లక్ష్యం. సీసీటీవీ నెట్‌వర్క్ విస్తరణ, డేటా అనలిటిక్స్ ఆధారంగా నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాల రూపకల్పన వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాం. దీనిలో ప్రజల భాగస్వామ్యం కీలకం అన్నారు. పోలీసింగ్ ప్రజలతో కలిసి జరగాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిపై స్వందించడమే కాక యువతలో చట్టపరమైన అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపడతామని పెర్కొన్నారు.
