Let's talk: editor@tmv.in
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు : భట్టి విక్రమార్క

హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు : భట్టి విక్రమార్క

T Venkata Ramana
11 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలపై విస్తృత ప్రచారం చేసే బాధ్యతను నరెడ్కో సంస్థ తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అన్ని దిక్కులా హైదరాబాద్ నగరం సమతుల్యంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నరెడ్కో బ్రౌచర్‌ను వారు ఆవిష్కరించారు.ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియల్ ఎస్టేట్ రంగం, నగరాభివృద్ధిపై పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని, రియల్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

నగర అభివృద్ధికి భారీ కేటాయింపులు

హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తోందని, గత రెండేళ్లలో రూ.20వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఉపముఖ్యమత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డుతో నగర ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుందన్నారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనే ప్రచారం అవాస్తవమన్నారు. రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్ల ధర పలకడమే నగర అభివృద్ధి వేగానికి నిదర్శనమన్నారు.

ప్రభుత్వ స్థలాల రక్షణకు 'హైడ్రా'

ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలను నిరోధించడంలో 'హైడ్రా' పకడ్బందీగా పనిచేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నామని, భవిష్యత్తులో అన్నీ ఇవే ఉంటాయని చెప్పారు. వీటికి పన్ను మినహాయింపులు కూడా ఇచ్చామన్నారు. భట్టివిక్రమార్క. మురుగునీటి శుద్ధి కోసం రూ.4 వేల కోట్ల వ్యయంతో ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్)లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.నగరం నాలుగు దిక్కులా మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు.

విద్య, వైద్య రంగాలపై దృష్టి

అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 100 స్కూళ్లను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఇప్పటికే పురోగతిలో ఉందని, రియల్టర్లు, బిల్డర్లు కేవలం విల్లాలు, హై-రైజ్ బిల్డింగ్‌లకే పరిమితం కాకుండా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అలాగే సీఎస్‌ఆర్‌ నిధులను విద్య, వైద్య రంగాలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా గౌరవిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.