Let's talk: editor@tmv.in
హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తున్న మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తున్న మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

Gaddamidi Naveen
9 డిసెంబర్, 2025

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకి మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆదివారం రాత్రి ఆలస్యంగా వచ్చిన ఇమెయిల్స్ ద్వారా మూడు వేర్వేరు నగరాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానాలను లక్ష్యంగా చేస్తూ బెదిరింపులు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. వీటిలో రెండు అంతర్జాతీయ విమానాలే కావడం గమనార్హం.

బాంబు బెదిరింపులకు గురైనవి బ్రిటిష్ ఎయిర్‌వేస్ బీఏ 277 (లండన్‌ హెత్రో నుంచి), లుఫ్తాన్సా ఎల్ హెచ్ 752 (ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి) ఇండిగో 6ఈ 7178 (కన్నూర్‌ నుంచి) విమానాలు. సమాచారం అందిన వెంటనే అన్ని విమానాలపైనా అప్రమత్త చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మూడు విమానాలూ సురక్షితంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యాయి. అంతర్జాతీయ విమానాలు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరాయని. బెదిరింపు ఇమెయిల్ అందిన వెంటనే ‘స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాళ్స్’ అమల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొంది.

ఈ భద్రతా విధుల్లో భాగంగా

• విమానాన్ని రన్‌వేపై ప్రత్యేక ప్రాంతానికి తరలించడం

• ప్రయాణికులు, సిబ్బంది, లగేజీకి పూర్తిస్థాయి తనిఖీలు

• అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచడం

• బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ వినియోగం వంటివి చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలి ఒక వారం లోపల ఇదే తరహాలో వచ్చిన బెదిరింపు ఇమెయిల్స్ కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలుసార్లు అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం దుబాయ్–హైదరాబాద్ఎమిరేట్స్, అలాగే ఇండిగో మదీనా–హైదరాబాద్ మరియు షార్జా–హైదరాబాద్ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. ఆ సందర్భంలో మదీనా నుంచి హైదరాబాద్ విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించడం జరిగింది.విమానాశ్రయ భద్రతా యంత్రాంగం తాజా సంఘటనలపై కూడా అత్యంత జాగ్రత్తగా నిఘా కొనసాగిస్తోంది.

హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తున్న మూడు విమానాలకు బాంబు బెదిరింపులు - Tholi Paluku