
హైదరాబాద్ మెట్రో హ్యాండోవర్ – భారత నగర రవాణా కలలకు కొత్త మలుపా...
ఎల్ & టీ తన వాటాను విడిచిపెట్టగా, తెలంగాణ ప్రభుత్వం సుమారు ₹13,000 కోట్లు అప్పును తన భుజం మీద వేసుకుని హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడం కేవలం కార్పొరేట్ ఒప్పందం మాత్రమే కాదు. ఇది భారత మెట్రో కలలకు ఒక ఆత్మపరిశీలన క్షణం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా ప్రశంసలు అందుకున్న ఈ మెట్రో, ఆర్థిక ప్రయోజనాల ఆశావాదం వాస్తవ అవసరాలపై ఎలా గెలిచిందో భవిష్యత్ భాగస్వామ్య కార్యకలాపాలకు హెచ్చరికగా నిలిచింది.
హైదరాబాద్ మెట్రో తొలి దశలో 69 కిలోమీటర్ల పొడవు, మూడు ప్రధాన కారిడార్లలో నిర్మించబడింది. ఎల్ & టీ ₹20,000 కోట్లు పెట్టుబడి పెట్టి, రోజుకు 15 లక్షల ప్రయాణికులు వస్తారని, భూమి అభివృద్ధి, వనరుల రూపాకల్పన ద్వారా పెద్ద మొత్తం లో ఆదాయం వస్తుందని అంచనా వేసింది. రైళ్లు సమయానికి పరిగెత్తాయి.ప్రయాణికులు లాభపడ్డారు. కానీ ఆర్థిక లెక్కలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. గరిష్టంగా కూడా రోజువారీ ఆదాయం 4 నుండి 5–5 లక్షల వద్దనే నిలిచింది. వార్షిక టికెట్ ఆదాయం సుమారు ₹500 కోట్లు మాత్రమే ఉండగా, అప్పు సేవలకే ₹1,200–1,500 కోట్లు అవసరమయ్యాయి. భూమి అభివృద్ధి చేసి వాణిజ్యం చెయ్యడం ద్వారా 40% ఆదాయం వస్తుందని భావించిన ప్రణాళిక ఆశించిన మేర ఫలించక పోగా, కోవిడ్ దెబ్బతో రైడర్షిప్ మరింత పడిపోవడంతో ప్రాజెక్టు ఆర్థికంగా కోలుకోలేని విధంగా కుదేలైంది. అయినా మెట్రో సామాజిక విలువ అనన్యం. ఒక ఆరు బోగీల రైలు దాదాపు 1,000 కార్ల స్థానాన్ని భర్తీ చేస్తుంది. రోడ్డు ట్రాఫిక్ తగ్గి కాలుష్యం తగ్గుతుంది. వేగవంతమైన, సురక్షిత రవాణా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఉద్యోగాలు, విద్యావకాశాల మెరుగుదలని పెంచుతుంది. స్టేషన్ల చుట్టుపక్కల భూమి విలువలు పెరిగి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉదాహరణకు ఢిల్లీ మెట్రో ప్రతీ ఏడాది సుమారు 300 మిలియన్ గంటల సమయాన్ని ఆదా చేసి, ₹10,000 కోట్ల పైగా ఉత్పాదకతను పెంచుతోందని అంచనా.
కానీ హైదరాబాద్ అనుభవం వలన తెలిసింది ఏమిటంటే, మెట్రోను వ్యాపార లాభాల దృష్టితో చూడటం ప్రమాదకరం. ఎలివేటెడ్ కారిడార్ ప్రతి కిలోమీటరు ₹250–350 కోట్లు, అండర్గ్రౌండ్ లైన్ ₹600 కోట్లు దాటే వ్యయం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా టికెట్ ఆదాయం మాత్రమే ఆపరేటింగ్ ఖర్చులను మించిన ఆదాయం తెస్తుందన్న ఉదాహరణలు తక్కువ. భూమి అభివృద్ధి, అధిక రైడర్ అంచనాలపై ఆధారపడి రూపొందిన భారత పీపీపీ మోడల్ సహజంగానే సున్నితంగా ఉంటుంది. కోవిడ్ మహమ్మారి కేవలం బీభత్సాన్ని బయటపెట్టలేదు.ఆర్థిక నష్టాన్ని మిగల్చింది.
పీపీపీ భాగస్వామ్యం ద్వారా ఒక సంస్థ నేర్చుకోవాల్సిన పాఠాలు
సాంకేతిక–డిమాండ్ సరిచూడాలి: జనాభా 50 లక్షల కంటే తక్కువ నగరాల్లో భారీ మెట్రో కంటే తక్కువ ఖర్చుతో బీఆర్టీఎస్, లైట్ రైలు వంటి పద్ధతులు అనుకూలం.
వాస్తవిక ఫైనాన్సింగ్: కనీసం 40–50% పెట్టుబడిని ప్రభుత్వం భరించాలి. బాండ్లు, బ్యాంకు రుణాలు తోడ్పడాలి. టికెట్లు, భూమి అమ్మకాల ద్వారా పూర్తి రికవరీ ఊహించడం భవిష్యత్తు అనర్దాలకు, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది.
ఇంటిగ్రేషన్ తప్పనిసరి: చివరి మైలు కనెక్టివిటీ లేకుంటే రైడర్షిప్ తక్కువగానే ఉంటుంది. ప్రతి లైన్ బస్సు రోజుకు 500–700 ప్రయాణికులను ఆకర్షించగలదు. హైదరాబాద్లోని 57 స్టేషన్ల వద్ద సమగ్ర ఫీడర్ సౌకర్యం ద్వారా మూడు లక్షల కొత్త ట్రిప్పులు సాధ్యం అవుతాయి అని అంచనా. నాన్-ఫేర్ ఆదాయం పటిష్టం: ఢిల్లీ మెట్రో తన ఆదాయంలో దాదాపు 20% ప్రకటనలు, రీటైల్ లీజులు ద్వారా సంపాదిస్తుంటే, హైదరాబాద్ 10% లోపే ఉంది. ప్రణాళికాబద్ధంగా ఏరియా పరంగా (ట్రాన్సిట్-ఒరియెంటెడ్ డెవలప్మెంట్) ద్వారా స్థిర ఆదాయం పొందాలి. పరిపాలన పారదర్శకత: స్వతంత్ర అథారిటీలు, స్పష్టమైన కాంట్రాక్టులు, లీగల్ అగ్రిమెంట్ రద్దు అవసరం. ఎన్నిసార్లు రైడ్ చేశారో వాటి డేటా, ఆర్థిక లెక్కలు బహిరంగం చేయాలి.
హైదరాబాద్ భవిష్యత్తు
ప్రభుత్వం త్వరగా ప్రణాళికలను చేపట్టాలి. ప్రస్తుత ఆపరేటర్ల అనుభవాన్ని కొనసాగిస్తూ, అప్పును 20–25 ఏళ్లలో పునర్ వ్యవస్థీకరించాలి. కేటాయించిన భూమిలో కొంతభాగాన్ని అభివృద్ధి చేస్తే వేల కోట్ల ఆదాయం సాధ్యం. ₹25,000 కోట్లు అంచనా వ్యయంతో ఉన్న రెండో దశను, మొదటి దశ రైడర్షిప్ పెరగకముందే అమలు చెయ్యాలని అనుకోవడం సమంజసంకాదు.
మెట్రోలు లాభం తీసుకొచ్చే యంత్రాలు కాదు. అవి ప్రజాసేవా ఆస్తులు. టికెట్ ఆదాయం కంటే ఎక్కువగా తగ్గిన ట్రాఫిక్, పెరిగిన ఉత్పాదకత, తక్కువ కాలుష్యం, సురక్షిత ప్రయాణం వంటి సామాజిక లాభాలు అసలైన రాబడులు. అయితే ఉహించుకున్న అంచనాలు, బలమైన ఫీడర్ సిస్టమ్, వాస్తవిక ఫైనాన్సింగ్ లేకపోతే మరిన్ని ప్రాజెక్టులు హైదరాబాద్ మెట్రో బాటలోనే నడిచే ప్రమాదం ఉంది. భారత పట్టణ జనాభా 2036 నాటికి 600 మిలియన్లు దాటే అవకాశం ఉంది. వేగవంతమైన, స్వచ్ఛమైన, సమగ్ర రవాణా డిమాండ్ మరింత పెరుగుతుంది. హైదరాబాద్ లో ఈ భాగస్వామ్య ఒప్పందం రద్దు దేశవ్యాప్తంగా మెట్రో నిర్మాణం, ఫైనాన్సింగ్ పద్ధతులను పునరాలోచించుకునే అవకాశం ఎంతైనా వుంది.. సరైన పాఠాలు నేర్చుకుంటే మెట్రోలు సుస్థిర నగరాల వెన్నెముకగా నిలుస్తాయి....లేకపోతే అవి ఖరీదైన తెల్ల ఏనుగులుగా మిగిలిపోతాయి....
