Let's talk: editor@tmv.in
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 జాప్యంపై సీఎం రేవంత్‌కు కిషన్‌‌రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 జాప్యంపై సీఎం రేవంత్‌కు కిషన్‌‌రెడ్డి లేఖ

Gaddamidi Naveen
17 జనవరి, 2026

నగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనుల్లో జరుగుతున్న జాప్యంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు.

తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ దిశగా అవసరమైన సమన్వయ చర్యలు వేగంగా ముందుకు సాగడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఈ అంగీకారం ఫేజ్–1ను ప్రస్తుత నిర్వాహక సంస్థ ఎల్ & టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం పూర్తయ్యాక, ముందుగా అంగీకరించిన జాయింట్ కమిటీ ద్వారా సమన్వయం ప్రారంభించాలనే షరతుతోనే ఉన్నదని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే ఫేజ్–2 పనులు సజావుగా ప్రారంభించవచ్చని స్పష్టం చేశారు.

అయితే, జాయింట్ కమిటీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల నామినేషన్ ఆలస్యం కావడం వల్ల అవసరమైన సమన్వయం మొదలుకావడం లేదని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మెట్రో విస్తరణకు సంబంధించిన కీలక నిర్ణయాలు, ప్రణాళికలు ముందుకు సాగడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఈ ప్రాజెక్టు జాప్యం కావడం నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

జాయింట్ కమిటీలో తెలంగాణ ప్రభుత్వ అధికారులను వెంటనే నామినేట్ చేయాలని, తద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వేగంగా ప్రారంభమై మెట్రో ఫేజ్–2 పనులు ఆలస్యం లేకుండా ముందుకు సాగాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. హైదరాబాద్ నగర ప్రజల పెరుగుతున్న రవాణా అవసరాలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మెట్రో విస్తరణ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ పౌరుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మెట్రో రైలు విస్తరణ పనులు త్వరితగతిన ప్రారంభమై పూర్తి కావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. కేంద్రం అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు త్వరగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.