Let's talk: editor@tmv.in
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రభుత్వ పరం: అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రభుత్వ పరం: అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

Gaddamidi Naveen
29 మార్చి, 2026

భాగ్యనగర ప్రజా రవాణా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రైవేట్ దిగ్గజం ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నిర్ణయానికి తెలంగాణ శాసనసభ శనివారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఫేజ్-1 ప్రాజెక్ట్ మొత్తం 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని చెప్పారు. ఇక ఫేజ్-2 ఏ, ఫేజ్-2 బి విస్తరణల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఫేజ్-2 ఏ 76.4 కిలోమీటర్లు, ఫేజ్-2 బి 86.1 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

ఫేజ్-1 ప్రస్తుతం ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఉండటం వల్ల సాంకేతిక, చట్టపరమైన, పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం వివరించారు. ఈ సమస్యల కారణంగా ఫేజ్-2 ప్రాజెక్టులను కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా కేంద్రం ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. తీర్మానానికి సభ్యుల మద్దతు లభించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆర్థిక అంశాలు

2025లో జరిగిన ఒప్పందం ప్రకారం, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌లో ఉన్న ఈక్విటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లు చెల్లించనుంది. దీనితో పాటు, ప్రాజెక్టుపై ఉన్న దాదాపు రూ.13,000 కోట్ల అప్పును కూడా ప్రభుత్వం భరించనుంది. ఎల్ అండ్ టీ సంస్థ ప్రాజెక్టులో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. అయితే నిర్వహణ లోపాలు, పేరుకుపోయిన నష్టాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ గతంలోనే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రకటించగా, దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, ఈ విషయంలో బీఆర్ఎస్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని, తీర్మానం ఏకగ్రీవం కాలేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రభుత్వ పరం: అసెంబ్లీలో తీర్మానం ఆమోదం - Tholi Paluku