
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు ప్రస్తుతం లేదు: హెచ్‌ఎంఆర్‌ఎల్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ చార్జీల పెంపుపై మీడియాలో వచ్చిన వార్తలపై మెట్రో అధికారులు స్పష్టీకరణ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి చార్జీ సవరణ జరగడం లేదని, ప్రయాణికులు పాత చార్జీలకే ప్రయాణించవచ్చని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్) చట్టం, 2002 ప్రకారం, మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ చార్జీల నిర్ణయం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, సిఫార్సుల ఆధారంగా మాత్రమే చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో ఒక హైకోర్టు న్యాయమూర్తి (అధ్యక్షుడు)తో పాటు, కేంద్రం, రాష్ట్రం నుంచి ఒక్కో ప్రతినిధి ఉంటారని వివరించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) గుడిసేవ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షుడిగా, డాక్టర్ సురేంద్రకుమార్ బగ్డే (అడిషనల్ సెక్రటరీ, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కేంద్ర ప్రభుత్వం) సభ్యుడిగా, అరవింద్ కుమార్ (ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం) సభ్యుడిగా ఉన్నారని తెలిపింది.
ఈ కమిటీ సిఫార్సుల మేరకు 2025 మే 24 నుంచి చార్జీల సవరణ అమల్లోకి వచ్చిందని, అప్పటి తర్వాత ఇప్పటివరకు ఎలాంటి కొత్త చార్జీ మార్పులు చేయలేదని హెచ్‌ఎంఆర్‌ఎల్ స్పష్టం చేసింది.అందువల్ల ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తక్షణ చార్జీల పెంపు ఏదీ ఉండదని అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మీడియాలో వెలువడిన చార్జీల పెంపు సంబంధిత వార్తలు వాస్తవానికి దూరమని, అధికారిక సమాచారం కోసం మెట్రో సంస్థ ప్రకటించిన వివరాలనే నమ్మాలని వారు సూచించారు.
