Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌ మారథాన్‌కు భారీ స్పందన.. 12 వేల మందికి పైగా హాజరు

హైదరాబాద్‌ మారథాన్‌కు భారీ స్పందన.. 12 వేల మందికి పైగా హాజరు

Gaddamidi Naveen
31 ఆగస్టు, 2026

నగరంలో ఆదివారం నిర్వహించిన 15వ ఎడిషన్‌ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌కు 12 వేల మందికి పైగా రన్నర్లు హాజరయ్యారు. వీరిలో 8,500 మందికి పైగా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌లో, 3,500 మందికి పైగా 42.2 కిలోమీటర్ల ఫుల్‌ మారథాన్‌లో పాల్గొన్నారు.

మహిళల ఎలైట్‌ విభాగంలో ఇథియోపియాకు చెందిన ఎమానే సెయిఫు విజేతగా నిలిచారు. అదే దేశానికి చెందిన త్సెగా డెస్టా రెండో స్థానంలో, కెన్యాకు చెందిన తెరెసియా ఒమోసా మూడో స్థానంలో నిలిచారు. పురుషుల ఎలైట్‌ విభాగంలో ఇథియోపియాకు చెందిన సెబోకా నెగుస్సే విజయం సాధించారు. కెన్యాకు చెందిన ఫెలిక్స్‌ కిముటాయ్‌ రెండో స్థానంలో, అదే దేశానికి చెందిన ఫ్రాన్సిస్‌ చెరుయట్‌ మూడో స్థానంలో నిలిచారు.

ఫుల్‌ మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌, 10కే విభాగాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం. రమేశ్‌, ఎన్‌ఎండీసీ డైరెక్టర్లు వివేక్‌ నిశాంత్‌ నాథ్‌, అనురాగ్‌ కపిల్‌ బహుమతులు అందజేశారు. ఈసారి మారథాన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన 184 మంది యువ గిరిజన రన్నర్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరికి అవసరమైన సహాయాన్ని ఎన్‌ఎండీసీ అందించింది. శనివారం నిర్వహించిన 5కే, ఇన్‌క్లూజివ్‌ రన్స్‌లో మరో 6,500 మంది పాల్గొన్నారు. ఇందులో సుమారు 300 మంది దివ్యాంగులు, 15 మంది విదేశీ, 30 మంది భారత ఎలైట్‌ రన్నర్లు ఉన్నారు.