
హైదరాబాద్ పోలీస్ 'ఇంటర్న్‌షిప్' ప్రోగ్రామ్ ప్రారంభం
హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతను జోడించడం లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ సరికొత్త 'ఇంటర్న్‌షిప్, వాలంటీర్ ఎంగేజ్‌మెంట్' కార్యక్రమాలను శనివారం ప్రారంభించింది. యువతలోని ప్రతిభను, నూతన ఆలోచనలను పోలీసు సేవల్లో భాగం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆధునిక పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా రూపకల్పన చేశారు. యువ విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, అకడమిక్ నైపుణ్యాలను వినియోగించి శాఖ పనితీరుకు తోడ్పడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన ఇంటర్న్‌లకు విభాగ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రత్యేక పనులు, విశ్లేషణాత్మక అసైన్‌మెంట్‌లు లేదా పరిశోధనాత్మక ప్రాజెక్టులు అప్పగిస్తారు. దీంతో వారికి పోలీసింగ్ వ్యవస్థ, ప్రజాపాలన విధానాలపై ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పని చేసే అవకాశంతో పాటు శాఖ పనితీరులో కొత్త ఆలోచనలను తీసుకురాగలరని అధికారులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక ధృవపత్రం అందజేస్తారు.
ఇదే సమయంలో అనుభవజ్ఞులైన నిపుణులను “స్ట్రక్చర్డ్ వాలంటీరింగ్” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ప్రత్యేక లేదా సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వృత్తిపరులు నిర్దిష్ట సాంకేతిక లేదా ప్రక్రియాపరమైన పనుల్లో తమ సేవలను అందించవచ్చు. వారి అనుభవం సంస్థాగత అభివృద్ధి, ఆవిష్కరణాత్మక కార్యక్రమాలకు దోహదపడనుంది. ఈ మొత్తం ఇంటర్న్‌షిప్, వాలంటీర్ కార్యక్రమాలను ఎస్‌ఎంఐటి సెల్ నోడల్ యూనిట్‌గా పర్యవేక్షిస్తుంది. ఇది కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలు నగర పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
