
హైదరాబాద్ పురానాపూల్ ఆలయ ఘటన:11 మంది అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని పురానాపూల్ ప్రాంతంలో ఆలయ అపవిత్రత, తదనంతర మతపరమైన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు వీరిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
జనవరి 15 రాత్రి, ఒక వ్యక్తి పురానాపూల్ దర్వాజాలోని మైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న ఫ్లెక్సీ బ్యానర్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనను నిరసిస్తూ కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా గుమిగూడి, సమీపంలోని పురానాపూల్ చిల్లా వద్ద నష్టం కలిగించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.
కామటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు, ఘటనల్లో పాల్గొన్న 11 మంది నిందితులను గుర్తించి జనవరి 19న అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం న్యాయహిరాసతకు పంపింది. మిగిలిన పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కామటిపురా, బహదూర్‌పుర ప్రాంతాల్లో గస్తీ పెంచడంతో పాటు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి, సున్నిత ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతి సామరస్యాన్ని కాపాడాలని, వదంతులు నమ్మవద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
