Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Panthagani Anusha
28 అక్టోబర్, 2025

నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్యారడైజ్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ పనుల కోసం సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు, అంటే సుమారు 18 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ (NH–44) వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద జలమండలికి చెందిన 800 మిల్లీమీటర్ల ఎంఎస్ పైప్‌లైన్‌ను విస్తరించే పనులు చేపట్టారు. మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఉన్న పాత పైప్‌లైన్‌ను కొత్త పైప్‌లైన్‌తో అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు

జలమండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం కింది ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది:

• నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాసనగర్,

• భోలక్‌పూర్, కవాడిగూడ, సీతాఫల్‌మండి

• హస్మత్‌పేట్, ఫీరోజ్‌గూడ, గౌతమ్‌నగర్.

• సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, బేగంపేట్ విమానాశ్రయం,

బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి, ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ రైల్వే కాలనీ ( సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు).

జలమండలి సూచనలు

నీటి సరఫరా నిలిచే ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని,అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ పనులు నగరంలోని మౌలిక వసతుల అభివృద్ధిలో భాగం, తాత్కాలిక అసౌకర్యం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన నీటి సరఫరా అందించడమే లక్ష్యం అని అధికారులు తెలిపారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. అదేవిధంగా కొత్త పైప్‌లైన్ అనుసంధానం ద్వారా నీటి ఒత్తిడి, సరఫరా స్థిరత్వం మెరుగుపడనుందని జలమండలి వెల్లడించింది.