
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన విమానానికి తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బుధవారం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగుతున్న సమయంలో 'నోస్ వీల్' (ముందు చక్రం) లో లోపం తలెత్తడంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్పందిస్తూ.. మార్చి 11న హైదరాబాద్-ఫుకెట్ విమానానికి నోస్ వీల్ సమస్య తలెత్తిన మాట వాస్తవమే. పైలట్లు నిబంధనల ప్రకారం వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నిలిపివేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించాం. సహకరించిన విమానాశ్రయ అధికారులకు ధన్యవాదాలు అని తెలిపారు.
విమాన ప్రయాణికులకు షాక్: పెరగనున్న టికెట్ ధరలు
మరోవైపు, విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా చేదు వార్త వినిపించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో, దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
విమానయాన రంగంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఖర్చులు మొత్తం ఆపరేటింగ్ వ్యయాల్లో దాదాపు 40 శాతం వరకు ఉంటాయని సంస్థ పేర్కొంది. 2026 మార్చి ప్రారంభం నుంచి సరఫరా అంతరాయాల కారణంగా ఫ్యూయల్ ధరలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. భారతదేశంలో ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో అధిక ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కారణంగా ఈ ఖర్చుల ఒత్తిడి మరింత పెరుగుతోందని తెలిపింది.
ఈ నేపథ్యంలో మూడు దశల్లో సర్‌చార్జ్ అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి దశ మార్చి 12 నుంచి బుక్ చేసే టికెట్లకు వర్తిస్తుంది. దేశీయ విమానాలు, సార్క్ దేశాలకు వెళ్లే విమానాలపై రూ.399 ఇంధన సర్‌చార్జ్ విధించనున్నారు. పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలపై 10 అమెరికన్ డాలర్లు అదనంగా వసూలు చేయనున్నారు.
దక్షిణ-ఆగ్నేయ ఆసియా మార్గాల్లో సర్‌చార్జ్ 40 డాలర్ల నుంచి 60 డాలర్లకు పెరుగుతుంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమానాలపై ఇది 60 డాలర్ల నుంచి 90 డాలర్లకు పెరుగుతుంది. రెండో దశ మార్చి 18 నుంచి అమలులోకి వస్తుంది. యూరప్‌కు వెళ్లే విమానాలపై సర్‌చార్జ్ 100 డాలర్ల నుంచి 125 డాలర్లకు పెరుగుతుంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో ఇది 150 డాలర్ల నుంచి 200 డాలర్లకు పెరుగుతుంది. హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఫార్ ఈస్ట్ ప్రాంతాలకు సంబంధించిన మూడో దశ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది.
అయితే కొత్త సర్‌చార్జ్ అమలుకు ముందు బుక్ చేసిన టికెట్లకు ఇది వర్తించదని, ప్రయాణ తేదీలు లేదా మార్గం మార్చినప్పుడు మాత్రమే కొత్త ఛార్జీలు వర్తించే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
