Let's talk: editor@tmv.in
హైద‌రాబాద్‌‌ డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ వేడుకలతో పరవశించిన నగరం!

హైద‌రాబాద్‌‌ డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ వేడుకలతో పరవశించిన నగరం!

Gaddamidi Naveen
19 జనవరి, 2026

హైదరాబాద్ నగరాన్ని సాంకేతికత, సంస్కృతి, వినోదాల సంగమంగా నిలిపిన డ్రోన్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలు నగరవాసులతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన డ్రోన్ ఫెస్టివల్‌లో రాత్రి ఆకాశం అద్భుత కాంతులతో మెరిసింది. వందల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి గాల్లోకి ఎగిరి, లైట్ అండ్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన రామప్ప ఆలయం, గోల్కొండ కోట, చార్మినార్, బుద్ధవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పాలపిట్ట (రాష్ట్ర పక్షి)తో పాటు తెలంగాణ టూరిజం లోగో వంటి ఆకృతులు డ్రోన్ల ద్వారా ఆకాశంలో రూపుదిద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి విజువల్‌కి ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి.

ఈ ఫెస్టివల్‌లో డ్రోన్ రేసింగ్, డ్రోన్ సాకర్ వంటి వినూత్న క్రీడలు యువతను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సాంకేతిక నైపుణ్యంతో పాటు వేగం, నియంత్రణను పరీక్షించే ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. లైవ్ మ్యూజిక్‌తో కలిసి నిర్వహించిన లైట్ షోలు ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి

ఇదే సమయంలో గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా సందర్శకులను ఆకట్టుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన 18 అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశంలోకి ఎగిరి హైదరాబాద్ ఆకాశాన్ని రంగులమయంగా మార్చాయి. ఉదయం వేళ బెలూన్ రైడ్స్, సాయంత్రం వేళ సంగీతానికి అనుగుణంగా వెలిగే ఇల్యూమినేటెడ్ బెలూన్ డిస్‌ప్లేలు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఈ దృశ్యాలను ఆస్వాదించారు. దీనితో పాటు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.

గ్రాండ్ ఫినాలే

ఈ వేడుకల గ్రాండ్ ఫినాలే జనవరి 18న పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనుండటం విశేషం. డ్రోన్ ఫెస్టివల్, బెలూన్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ తన సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సాంకేతికత, పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటింది. హైదరాబాద్ నిజంగా ఈ రోజుల్లో “స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్”గా నిలిచిందని చెప్పవచ్చు.

హైద‌రాబాద్‌‌ డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ వేడుకలతో పరవశించిన నగరం! - Tholi Paluku