
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్: లింక్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలోని ప్రధాన రహదారులపై ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన లింక్ రోడ్ల అభివృద్ధికి తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ '2047 విజన్' లో భాగంగా బుధవారం రహదారుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయం లోపు చేరుకునేలా రహదారి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రింగ్ రోడ్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ ఇతర ప్రధాన ఆసుపత్రుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రణాళికలు అమలైతే హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
