
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల మంజూరులో ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుందని అన్నారు.ఎల్–1 ఇళ్ల స్థలాలు ఉండి, ఇల్లు లేని 4,800 మంది అర్హులైన పేదలకు రెండు పడకల గదుల ఇల్లు నిర్మించుకోవడానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే ఎల్–2 కింద హైదరాబాద్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి 4 లక్షల 22 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. నగరంలో భూముల కొరత దృష్ట్యా స్థలాల సేకరణ చేపట్టి జీ+5 నుంచి జీ+10 అంతస్తుల వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటికే ప్రారంభమైన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో, ఎంతమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారో వంటి వివరాలను సమీక్షించారు. పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల అభివృద్ధి, కొత్త ఇళ్ల నిర్మాణానికి భూముల సేకరణ, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పూర్తి, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల కేటాయింపు వంటి అంశాలపై శాసనసభ్యులతో కలిసి మంత్రి సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే దిశగా సమావేశం సాగింది.
