
హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి
నగరంలో మంగళవారం రాత్రి శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూమ్ యజమాని మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మంగళవారం రాత్రి నగరంలోని శాలిబండలోని ప్రధాన రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించాయి. షోరూం లోపల ఉన్న టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇన్వర్టర్ బ్యాటరీలు ఒక్కసారిగా పేలి భవనం మొత్తం చుట్టుముట్టాయి. పేలుళ్ల ధాటికి షోరూమ్ ముందు పార్క్ చేసిన సీఎన్‌జీ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. పక్కనే ఉన్న ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. పక్కనే ఉన్న వస్త్ర దుకాణం కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి కూడా అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడినవారిలో షోరూమ్ యజమాని ఉన్నారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మిగతా గాయపడిన వారిలో ఇద్దరు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఐదుగురిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. పక్కనే ఉన్న నివాస భవనాల్లోని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణాలు, పేలుళ్ల తీవ్రతపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఘటన స్థలాన్ని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ పరిశీలించారు. నగరంలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ తరహా అగ్నిప్రమాదాలు పట్టణ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక చర్యలు, భద్రతా ప్రమాణాలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజేస్తోంది.
