
హైదరాబాద్ అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించాం: డిప్యూటీ సీఎం భట్టి
భాగ్యనగర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని, రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో నిధులు వెచ్చించడం ఇదే తొలిసారి అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలతో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1950.52 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలో రూ.12,500 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.4,3365 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్–2047లో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహం ద్వారా కోర్ అర్బన్ రీజియన్ ఆర్థికాభివృద్ధిని కేంద్రంగా ఉంచి ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు, ప్రతిభ, జీవన ప్రమాణాల పరంగా హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ నిర్ణయం ద్వారా నగరానికి సమగ్ర అభివృద్ధి దృక్పథం, ఒకే విధమైన పౌర సేవలు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయడం సాధ్యమైందని చెప్పారు.
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్‌ను నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరు కావడం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని చాటుతుందని అన్నారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం ప్రాతిపదికన హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు.
