Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో 7 టన్నుల కల్తీ మామిడి పండ్లు స్వాధీనం

హైదరాబాద్‌లో 7 టన్నుల కల్తీ మామిడి పండ్లు స్వాధీనం

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు హైదరాబాద్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. శుక్ర‌వారం జరిగిన వేర్వేరు దాడుల్లో సుమారు 7 టన్నులకు పైగా కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని అసిఫ్ నగర్ పరిధిలోని ఒక పండ్ల గోదాముపై 'హెచ్-ఫాస్ట్' బృందాలు మెరుపు దాడులు చేశాయి. బటాసింగారం మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లను పరిమితికి మించి ఇథిలీన్ ప్యాకెట్లను ఉపయోగించి కృత్రిమంగా మగ్గబెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 7 టన్నుల మామిడి పండ్లను సీజ్ చేసి, నిందితులు జమీల్, ఫరీద్‌లపై కేసులు నమోదు చేశారు.

గోషామహల్‌లో మరో ముఠా గుట్టురట్టు

అదేవిధంగా, గోషామహల్ పోలీసులు చూడీ బజార్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో కునాల్ నోకత్వాలే అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. ఇతను దాదాపు 200 కేజీల మామిడి పండ్లను డైమండ్ రైప్ అనే కెమికల్ ప్యాకెట్లను అతిగా వాడి పండిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ చర్యలు వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ, రసాయనాలతో పండించిన పండ్లు తినడం వల్ల గొంతు మంట, వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. వినియోగదారులు పండ్లు కొనేముందు వాటిని జాగ్రత్తగా గమనించాలని, పండ్ల నుంచి రసాయనాల వాసన వస్తుంటే అనుమానించాలని సూచించారు. ఏదైనా అక్రమ నిల్వలు లేదా కల్తీ పండ్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 కి లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.