
హైదరాబాద్‌లో 17వ రోజ్ గార్ మేళా
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఈ రోజు జరిగిన 17వ రోజ్ గార్ మేళా సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కొత్తగా ఎంపికైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు.
కొత్తగా నియమితులైన ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో 11 లక్షలకుపైగా యువతకు ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన పేర్కొన్నారు
“ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, దేశ అభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించే అవకాశం” అని ఆయన అన్నారు. యువతను ఉద్యోగదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ, స్టార్టప్‌లకు అందుతున్న బలాన్ని వివరించారు. “గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యవసాయం నుండి సాంకేతిక రంగం వరకు అనేక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా. వీనా కుమారి డెర్మల్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సౌతర్న్ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ , హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ బసబ్ ముఖోపాధ్యాయ, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ జనరల్ మేనేజర్, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఎస్. ఆర్. వాజ్పే, డివిజన్ కార్పొరేటర్ డా. సురేఖ బీశ్వా మరియు తెలంగాణ సర్కిల్ పోస్ట్ కౌన్సిల్ డైరెక్టర్ సి. ఎం. సంపూర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ విభాగం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, సిఎస్ఐఆర్-ఐఐసీటి హైదరాబాద్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్నుశాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, విమానాశ్రయ ప్రాధికార సంస్థ, సీఐఎస్ఎఫ్, ఎస్‌ఎస్‌బీ వంటి వివిధ శాఖలకు చెందిన సుమారు 80 మంది అభ్యర్థులు నియామక పత్రాలు స్వీకరించారు.
దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 17వ రోజ్ గార్ మేళా నిర్వహించబడింది. జాతీయ స్థాయిలో, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్దేశించి ప్రసంగించారు.
