Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ‘స్పేస్ సిటీ’ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో ‘స్పేస్ సిటీ’ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
31 ఆగస్టు, 2026

సమాచార సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన తెలంగాణ, ఇప్పుడు 'స్పేస్ టెక్నాలజీ'ని తన తదుపరి ప్రధాన వృద్ధి రంగాలుగా ఎంచుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో దేశంలోని 14 ప్రముఖ స్పేస్-టెక్ కంపెనీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న లాంచ్ వెహికల్స్ (రాకెట్లు), శాటిలైట్ సిస్టమ్స్, ఆర్బిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్‌డ్ సెన్సింగ్, నావిగేషన్, కమ్యూనికేషన్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఆయా సంస్థలు మంత్రికి వివరించాయి. స్పేస్-టెక్ రంగానికి చెందిన నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు అంతరిక్ష సాంకేతిక వ్యవస్థనంతటినీ ఒకే చోటికి చేర్చి, వేగవంతమైన వృద్ధికి అవసరమైన ప్రత్యేక మౌలిక వసతులను కల్పించేందుకు 'స్పేస్ సిటీ' ని అభివృద్ధి చేయాలని మంత్రికి ప్రతిపాదించారు.

ఈ సూచనను సానుకూలంగా స్వాగతించిన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రపంచంలోని టాప్ 5 అంతరిక్ష సాంకేతిక కేంద్రాలలో హైదరాబాద్‌ను ఒకటిగా నిలిపే ప్రణాళికలో భాగంగా స్పేస్ సిటీ అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు కేవలం రాకెట్లు, ఉపగ్రహాలనే కాక, అంతరిక్ష వ్యర్థాల తొలగింపు , ఆర్బిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అధునాతన ఫ్రాంటియర్ సాంకేతికతలను రూపొందిస్తున్నాయి. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణంలో ఈ రంగాలన్నింటినీ సమన్వయం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద డిప్-టెక్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు.

గత రెండున్నరేళ్లలో హైదరాబాద్ ఆవిష్కరణల ప్రయాణం వేగవంతమైందని, కేవలం సర్వీసెస్ హబ్‌గా కాకుండా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా రూపాంతరం చెందుతోందని మంత్రి తెలిపారు. గత 18 నెలల కాలంలోనే తెలంగాణలో 150కి పైగా 'గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు' ఏర్పాటయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

భారత్‌లోని 30శాతం స్పేస్-టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌లోనే

దేశంలో ఉన్న అత్యుత్తమ స్పేస్-టెక్ కంపెనీలలో 30 శాతానికి పైగా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుండటం గర్వకారణమని మంత్రి అన్నారు. ఈ భేటీలో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సీఈఓ పవన్ కుమార్ చందన, ధ్రువ స్పేస్ కో-ఫౌండర్ చైతన్య డోరా సూరపురెడ్డి, కాన్‌స్టెల్లీ కో-ఫౌండర్ అవినాష్ చెన్‌రెడ్డి, టేక్‌మీ2స్పేస్ ఈవీపీ ఆనంద్ రాజగోపాలన్‌లతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.