
హైదరాబాద్‌లో సంచలనం డ్రగ్స్ కేసులో ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ హైదరాబాద్‌లో గంజాయి వినియోగం చేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ ఘటన నేపథ్యంలో అతడిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు.
తెలంగాణ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఏర్పాటైన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) అధికారులకు గంజాయి వినియోగంపై సమాచారం అందడంతో, నగరంలోని ఒక విల్లాను తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ గంజాయి వినియోగం చేసినట్లు నిర్ధారణ అయ్యిందని. ఈ సమయంలో అతడు ఉద్రిక్తంగా, దూకుడుగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, అక్కడ ఉన్న మిగతా ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాల వినియోగం చేయలేదని పరీక్షల్లో తేలిందన్నారు.
సుధీర్‌ను అనంతరం అతని కుటుంబ వైద్యుడి సహాయంతో డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, అతడు మాదక ద్రవ్యాల వినియోగదారుడిగా గుర్తించాం. అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తాం అని తెలిపారు.
ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉండగా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయ విమర్శలు గుప్పించింది. సుధీర్ గతంలో కూడా ఒక నార్కోటిక్స్ కేసులో సంబంధం ఉందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
