Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు: జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ గాలిపటాల పండుగ

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు: జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ గాలిపటాల పండుగ

Gaddamidi Naveen
23 డిసెంబర్, 2025

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే సంక్రాంతి పండుగను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, జనవరి 13 నుంచి 15 వరకు నగరాన్ని పండుగ శోభతో ముంచెత్తేలా అంతర్జాతీయ గాలిపటాల పండుగ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఈ వేడుకల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సమావేశంలో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఈ పతంగుల పండుగ హైదరాబాద్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని, పండుగ ఉత్సాహాన్ని దేశ విదేశాలకు చాటే విధంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా హైడ్రా ఆధ్వర్యంలో పునరుజ్జీవింపబడిన సరస్సుల వద్ద పతంగుల పండుగ కార్యక్రమాలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించేలా వేదికలు, భద్రత, పార్కింగ్, రవాణా సౌకర్యాలను సమర్థంగా ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.

ఈ పండుగకు ప్రత్యేక పేరు, బ్రాండింగ్, లోగో రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా నుంచి ప్రత్యేకంగా నియమిత అధికారులు సమన్వయంతో పనిచేయనున్నారు. అలాగే జనవరి మొదటి వారం నుంచే మంత్రులు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నట్లు ఆయ‌న వెల్లడించారు.

అంతర్జాతీయ పతంగుల పండుగ ప్రధాన కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15 వరకు జరుగనున్నాయి. దేశవిదేశాల నుంచి పతంగుల కళాకారులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. అదనంగా, నగర అవుట్‌స్కర్ట్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే దేశవ్యాప్తంగా పేరొందిన పైలట్లతో డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మొత్తంగా, ఈ అంతర్జాతీయ పతంగుల పండుగ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో మరింత విశిష్టంగా నిలిపేలా, సంక్రాంతి సంబరాలను ప్రజలకు మరపురాని అనుభూతిగా మార్చేలా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు: జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ గాలిపటాల పండుగ - Tholi Paluku