Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో వినూత్న 'హెల్మెట్ బ్యాంక్': జరిమానా కంటే ప్రాణం ముఖ్యం!

హైదరాబాద్‌లో వినూత్న 'హెల్మెట్ బ్యాంక్': జరిమానా కంటే ప్రాణం ముఖ్యం!

Gaddamidi Naveen
24 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌లో ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సోమవారం “హెల్మెట్ బ్యాంక్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు భద్రతను కేవ‌లం చలానాలు వేయడమే లక్ష్యం కాకుండా, అవగాహనతో మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ 'హెల్మెట్ బ్యాంక్' ఎలా పనిచేస్తుంది?

ఈ కార్యక్రమం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించినప్పుడు, వారికి తక్షణమే ఉచితంగా హెల్మెట్‌ను అప్పుగా అందిస్తారు. ఇందుకు సంబంధిత వ్యక్తులు తమ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన అనంతరం 24 గంటల లోపు అప్పుగా తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా వెంటనే భద్రతా నియమాలను పాటించేలా ప్రోత్సహించడం, ప్రాణరక్షణను ప్రధానంగా చూడటం లక్ష్యమని ట్రాఫిక్-1 (మల్కాజిగిరి) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. రాహుల్ రెడ్డి తెలిపారు.

హెల్మెట్ ధరించడం జరిమానా భయంతో కాకుండా, స్వీయ రక్షణ చర్యగా చూడాలనే సానుకూల ఆలోచనను ద్విచక్ర వాహనదారుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. శిక్షలకన్నా బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక మార్పును తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు.

మల్కాజిగిరి జోన్‌లోని ముఖ్య ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఈ హెల్మెట్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నారు. తల గాయాలను నివారించడం, ప్రాణాలను కాపాడటం, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించడం, రోడ్డు భద్రతపై స్థిరమైన ప్రవర్తనా మార్పును తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

అదనంగా, తెలంగాణ పోలీసుల “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా ప్రచారానికి ఈ కార్యక్రమం బలాన్నిస్తుంది. ప్రయాణ దూరం ఎంతైనా సరే, ప్రతి సారి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే సందేశాన్ని ఇది పునరుద్ఘాటిస్తోంది. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు అన్ని ద్విచక్ర వాహనదారులు క్రమం తప్పకుండా హెల్మెట్ ధరించి సురక్షిత రహదారుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.