Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో రూ. 232 కోట్లతో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్

హైదరాబాద్‌లో రూ. 232 కోట్లతో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్

Gaddamidi Naveen
12 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రతిష్టాత్మక సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రి మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. రూ.232.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాన్ని ఉప్పల్‌లోని సీఎస్ఐఆర్- ఐఐసీటీ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌ ఈ ప్రాజెక్టు చేపడుతోంది.

శాస్త్ర విజ్ఞానం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకునే అవకాశాలను కల్పించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. అందుకు అనుగుణంగా ఇక్కడ అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రంలోని విశేషాలు ఇవీ...

ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్ హాల్స్: సైన్స్ విశేషాలను స్వయంగా అనుభవించేలా గదులు.

మోషన్ సిమ్యులేటర్లు: గ్రహాంతర ప్రయాణం లేదా క్లిష్టమైన భౌతిక పరిస్థితులను అనుభవించేలా చేసే యంత్రాలు.

వాక్-త్రూ అక్వేరియం: సముద్ర గర్భంలోని వింతలు, జలచరాల జీవనశైలిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

3డీ డిజిటల్ డోమ్ థియేటర్: అంతరిక్షం, ఖగోళశాస్త్ర విశేషాలను కళ్లకు కట్టినట్లుచూపే అత్యాధునిక థియేటర్‌.

రోబోటిక్స్ అండ్ స్పేస్ సెంటర్: అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ, ఖగోళ శాస్త్రంపై ప్రత్యేక ప్రదర్శనలు.

ఇన్నోవేషన్ హబ్స్: విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలకు రూపకల్పన చేసేందుకు అవసరమైన ప్రయోగశాలలు, యాక్టివిటీ జోన్లు రాబోతున్నాయి.

ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, శాస్త్ర సాంకేతిక రంగాలలో హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్‌గా మరింత పేరుగాంచుతుంది. తెలంగాణ యువతకు ప్రయోగాత్మక విద్యను అందించడమే కాకుండా, నూతన ఆవిష్కరణలకు ఇది ఒక గొప్ప వేదికగా మారుతుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అన్ని శాస్త్ర విభాగాలను ఒకే చోట చేర్చి, విజ్ఞానాన్ని వినోదంతో కూడిన అనుభవంగా మార్చడమే ఈ సైన్స్ సెంటర్ ప్రధాన ఉద్దేశం.