
హైదరాబాద్లో రూ. 22 లక్షల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్.. యజమాని అరెస్ట్
హైదరాబాద్లో కల్తీరాయుళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట కల్తీ దందా బాగోతం బయటపడుతూనే ఉంది. నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) హెచ్-ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా కాటేదాన్ లోని ఎస్‌కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్' పై మెరుపు దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో అబిడ్స్‌కు చెందిన యూనిట్ యజమాని హసన్ అలీ రూపానీ (55) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎటువంటి ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ యూనిట్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిగనిగలాడే రంగు, వాసన కోసం నాసిరకం ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్, జాంతన్ గమ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తయారైన కల్తీ పేస్ట్‌ను నగరంలోని వివిధ రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు విచారణలో తేలింది.
ఈ దాడిలో అధికారులు భారీగా నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4032 కిలోల కల్తీ అల్లం పేస్ట్, 6210 కిలోల నాసిరకం ముడి పదార్థాలు, ఇతర సంబంధిత సామగ్రిని పట్టుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా భావించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసిన వస్తువులతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, ప్రమాణాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
